IBL
-
ఏప్రిల్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్
న్యూఢిల్లీ: గత ఏడాది బ్యాడ్మింటన్ అభిమానులను ఆకట్టుకున్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్ (2014) మాత్రం నిర్వహించనే లేదు. దాంతో ఈ టోర్నీ ఇకపై సాగుతుందా, లేదా అనే సందేహాలు వినిపించాయి. అయితే వచ్చే సంవత్సరం ఐబీఎల్ జరపనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఏప్రిల్ 12నుంచి మే 2 వరకు ఈ టోర్నీ జరగనుంది. ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో, ఫైనల్ మ్యాచ్ ముంబైలో నిర్వహిస్తారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేశ్ దాస్ గుప్తా, టోర్నీ హక్కులు ఉన్న స్పోర్టీ సొల్యూషన్స్ మధ్య విభేదాలతోనే ఈ సంవత్సరం టోర్నీ జరగలేదు. స్పోర్టీనుంచి గ్యారంటీ మనీగా రూ. 50 కోట్లు గుప్తా డిమాండ్ చేసినట్లు సమాచారం. చివరకు గత వారం కేంద్ర క్రీడా మంత్రి సోనోవాల్ జోక్యంతో సమస్య పరిష్కారమైంది. మరో వైపు ఢిల్లీ, ముంబై జట్ల ఫ్రాంచైజీలు కూడా మారిపోయారు. గవాస్కర్, నాగార్జున, చాముండిలకు చెందిన ముంబై జట్టును వారు మరో సంస్థకు అమ్మేశారు. ఢిల్లీ జట్టు తమ ఆటగాళ్లకు చెల్లింపులు జరపడంలో విఫలం కావడంతో ఆ ఫ్రాంచైజీని రద్దు చేసి మరొకరికి ఇచ్చినట్లు సమాచారం. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌తో సమానం!
సాక్షి, హైదరాబాద్: తొలి ఏడాదే తన సొంత జట్టు హైదరాబాద్ తరఫున ఆడి ఐబీఎల్‌లో టైటిల్ నెగ్గడం చాలా సంతోషంగా ఉందని హాట్‌షాట్స్ ప్లేయర్ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. టోర్నీ ఈ స్థాయిలో విజయవంతం అవుతుందని తాను ఊహించలేదని ఆమె చెప్పింది. ఐబీఎల్ విజేతగా నిలిచిన హైదరాబాద్ హాట్‌షాట్స్ టీమ్ యాజమాన్యం పీవీపీ గ్రూప్ సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. సైనాతో పాటు టీమ్ కోచ్ రాజేందర్, పీవీపీ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి ఇందులో పాల్గొన్నారు. ‘ఐబీఎల్ నాకో కొత్త అనుభవం. హైదరాబాద్ తరఫున ఆడటంతో పాటు విజేతగా నిలవడంతో నా కల నిజమైనట్లుగా అనిపిస్తోంది. తొలి సారే చాంపియన్‌గా నిలవడం ఆనందంగా ఉంది’ అని సైనా వెల్లడించింది. టోర్నీ మొత్తం తాను దూకుడుగా ఆడానని, సింధుపై నెగ్గేందుకు ప్రత్యేకంగా ఏమీ చేయలేదని సైనా చెప్పింది. ‘సింధుతో పోటీ గురించి పత్రికల్లోనే చదివాను. ఇటీవల ఆమె బాగా ఆడుతోంది. నా సహజశైలిలోనే ఆడి సింధును ఓడించాను. ఆ రెండు రోజులు నావి అని చెప్పగలను. టోర్నీలో నాకు యింగ్ తై జు (బంగా బీట్స్) గట్టి పోటీ ఇచ్చింది. నా దృష్టిలో వరుసగా ఏడు మ్యాచ్‌లు నెగ్గడం వరల్డ్ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లతో సమానంగా అనిపిస్తోంది’ అని ఈ హైదరాబాదీ విశ్లేషించింది. ప్రధానంగా సింగిల్స్ ప్లేయరే అయినా...మేనేజ్మెంట్ నమ్మకం ఉంచడంతో సాహసం చేసి మిక్స్డ్ డబుల్స్ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నానని, అయితే అదృష్టవశాత్తూ సెమీఫైనల్, ఫైనల్లలో తాను ఆడకుండానే జట్టు గెలవడం పట్ల సైనా సంతోషం వ్యక్తం చేసింది. ప్రతీ ఆటగాడికి తన ఫిట్నెస్ సామర్ధ్యంపై అవగాహన ఉండాలని చెప్పిన ఈ టాప్ షట్లర్, టోర్నీ షెడ్యూల్ వల్ల తనకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని సంతృప్తి వ్యక్తం చేసింది. తన అభిమాన హీరో షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ను ఇప్పటికే చూశానని, అందులోని లుంగీ డ్యాన్స్‌ను కూడా ప్రయత్నించానని సైనా నెహ్వాల్ సరదాగా చెప్పింది. ఇది తెలుగువాళ్లందరి జట్టు గత ఏడాది నవంబర్ 10న ఐబీఎల్ ప్రకటించగానే జట్టు కోసం నిర్వాహకులను కలిసిన తొలి వ్యక్తిని తానేనని, ఇప్పుడు హైదరాబాద్ విజేతగా నిలవడం ఆనందాన్ని రెట్టింపు చేసిందని హాట్‌షాట్స్ యజమాని ప్రసాద్ వి. పొట్లూరి అన్నారు. ‘హాట్‌షాట్స్ జట్టు ప్రతీ తెలుగు వ్యక్తికి చెందింది. ఈ విజయం అందరిదీ. మేం కేవలం నిర్వాహకులం మాత్రమే. క్రీడాభిమానులుగా ఇతర ఆటల్లోకి కూడా విస్తరించాలన్న ఆలోచన ఉంది. బ్యాడ్మింటన్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రాధమిక స్థాయిలో కూడా త్వరలో వేర్వేరు కార్యక్రమాలు చేపట్టనున్నాం’ అని ఆయన చెప్పారు. తొలి ఏడాదే ఐపీఎల్‌లాంటి మెగా ఈవెంట్‌తో పోల్చడం తొందరపాటే అవుతుందని, అయితే ఈ ఏడాది లోపాలు సరిదిద్దుకొని వచ్చే సారి మరింత మెరుగ్గా లీగ్ నిర్వహిస్తామని ప్రసాద్ స్పష్టం చేశారు. -
సింధుకు ఆ అదృష్టం ఎప్పుడో!
సాక్షి, హైదరాబాద్: 18 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంచలనం పూసర్ల వెంకట సింధుకు పురస్కారం అందుకునే అదృష్టం మాత్రం దక్కలేదు. శనివారం ముంబైలో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఫైనల్ ఆడుతున్న కారణంగా సింధు...ఢిల్లీలో అర్జున ప్రదానోత్సవం కార్యక్రమానికి వెళ్లలేకపోయింది. ఆమె తరఫున తల్లిదండ్రులు రమణ, విజయలలో ఒకరు ఈ అవార్డును తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే ఇందుకు నిబంధనలు అంగీకరించవని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కొద్ది రోజుల అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి ద్వారా గానీ, రాష్ట్ర గవర్నర్ ద్వారా గానీ అర్జున అవార్డును సింధుకు అందజేసే అవకాశం ఉంది. మరో వైపు క్రీడా శిక్షణలో అత్యుత్తమ ఫలితాలు అందిస్తున్న ‘పుల్లెల గోపీచంద్ - నిమ్మగడ్డ ఫౌండేషన్ బ్యాడ్మింటన్ అకాడమీ’కి దక్కిన ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ను గోపీచంద్ తల్లిదండ్రులు సుబ్బారావమ్మ, సుభాష్ చంద్ర అందుకున్నారు. -
కొనసాగుతున్న సైనా జైత్రయాత్ర
హైదరాబాద్ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఐబీఎల్ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన సెమీస్ ఫైనల్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-10, 19-21, 11-8 తేడాతో జులియన్ షెంక్‌పై విజయం సాధించి తన సత్తాను మరోసారి చాటింది. ఓ దశలో జులియంక్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనప్పటికీ సైనా వాటిని అధిగమించి జయకేతనం ఎగురవేసింది. పాయింట్ల పట్టికలో స్థానాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ఆడే సెమీఫైనల్ మ్యాచ్‌ను నగరంలోనే నిర్వహించారు. హైదరాబాద్ తొలి రెండు స్థానాల్లో నిలిస్తే... మూడు, నాలుగు స్థానాల్లో నిలచిన జట్లలో ఒక జట్టును డ్రా ద్వారా నిర్ణయించి హాట్‌షాట్స్‌తో ఆడిస్తారు. ఈ మ్యాచ్‌లో సైనా విజయం సాధించడంతో నగర ప్రేక్షకులను కనువిందు చేసింది. రేపు జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పోరుకు ఈ విజయం ఊరట నిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. -
జన్మదినం రోజున ముంబై మాస్టర్ తోనే: నాగార్జున
తన జన్మదినం రోజున ముంబై మాస్టర్ జట్టును పోత్సాహిస్తూ గడపాలనుకుంటున్నట్టు టాలీవుడ్ హీరో నాగార్జున వెల్లడించారు. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, వ్యాపారవేత్త చాముండేశ్వర నాథ్ ల భాగస్వామ్యంతో నాగార్జున ఐబీఎల్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన జన్మదినం రోజున బెంగుళూరులో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో తన జట్టకు ప్రోత్సాహిస్తూ గడుపుతానని తెలిపారు. ఇటీవల కాలంలో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో కలిసి మహీ రేసింగ్ జట్టుకు సహచర భాగస్వామిగా ఉన్నాడు. ఈ సంవత్సరం తాను కొనుగోలు చేసిన జట్లు రాణించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోంది అని నాగార్జున అన్నారు. త్వరలో ముగిసే రేసింగ్ లీగ్ లో తమ జట్టు అగ్రస్థానంలో ఉందని, బాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ జట్టు సెమీ ఫైనల్ కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇలాగే తన జట్లు విజయపథంలో ప్రయాణించాలని కోరుకుంటున్నానని నాగార్జున తెలిపారు. ఆగస్టు 29 నాగార్జున జన్మదినం జరుపుకోనున్న నాగార్జున చిత్ర రంగంలోనూ, క్రీడారంగంలో బిజీగా ఉన్నారు. త్వరలోనే నాగార్జున నటించిన భాయ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఆస్థాయిలో ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)కు క్రేజ్ లభిస్తున్న సంగతి తెలిసిందే! -
నాలుగేళ్ల తర్వాత... నేడు హైదరాబాద్‌లో సైనా మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: ఐబీఎల్‌లో హైదరాబాద్ అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నగరానికి చెందిన స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మంగళవారం సొంత ప్రేక్షకుల నడుమ బరిలోకి దిగనుంది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ హాట్ షాట్స్, బంగా బీట్స్ జట్లు తలపడనున్నాయి. 2009 ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత సైనా ఒక మేజర్ టోర్నీలో సొంత ప్రేక్షకుల సమక్షంలో ఆడనుండటం ఇదే తొలిసారి. అందులోనూ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాక సైనా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉండటంతో సహజంగానే ఎక్కువ మంది దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం జరిగే మ్యాచ్ కోసం ప్రేక్షకులకు మొత్తం 2800 టికెట్లు అందుబాటులో ఉంచారు. ఇందులో శనివారంనాటికే 2600 అమ్ముడుపోగా, ఆదివారం మిగతా టికెట్లు ప్రేక్షకులు కొనేసుకున్నారు. దాంతో సైనా మ్యాచ్ చూడాలంటే ఇప్పుడు ఎవరికీ టికెట్లు అందుబాటులో లేవు. హాట్‌షాట్స్ సెమీస్ హైదరాబాద్‌లోనే...: పాయింట్ల పట్టికలో స్థానాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ఆడే సెమీఫైనల్ మ్యాచ్‌ను నగరంలోనే నిర్వహించనున్నారు. హైదరాబాద్ తొలి రెండు స్థానాల్లో నిలిస్తే... మూడు, నాలుగు స్థానాల్లో నిలచిన జట్లలో ఒక జట్టును డ్రా ద్వారా నిర్ణయించి హాట్‌షాట్స్‌తో ఆడిస్తారు. కాబట్టి నగర ప్రేక్షకులు వరుసగా రెండు రోజులు సైనా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడొచ్చు. హైదరాబాద్ హాట్‌షాట్స్ ్ఠ బంగా బీట్స్ రాత్రి గం. 8 నుంచి ఈఎస్‌పీఎన్‌లో లైవ్ -
నగరంలో ఐబీఎల్ సందడి
భారత్‌లో బ్యాడ్మింటన్‌కు చిరునామాగా మారిన హైదరాబాద్‌లో ఐబీఎల్ సందడి మొదలైంది. సోమవారం గ చ్చిబౌలి స్టేడియంలో అవధ్ వారియర్స్, పుణే పిస్టన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సింధు, శ్రీకాంత్ తదితర తెలుగుతేజాలు ఆడటంతో స్టేడియం సందడిగా మారింది. ప్రేక్షకులు ప్రశాంతంగా... సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటం అంటే అదో పెద్ద యజ్ఞంలాంటిది. సెల్ఫోన్లు తీసుకు రావద్దని, పార్కింగ్‌కు అనుమతి లేదని, కనీసం వాటర్ బాటిల్స్‌ను కూడా అనుమతించమని... ఇలా అడుగడుగునా అగ్ని పరీక్షతో ప్రేక్షకులు ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఐబీఎల్ కోసం మాత్రం ఇలాంటి సవాలక్ష నిబంధనలు లేకపోవడం ప్రేక్షకులకు ఓదార్పునిచ్చింది. ఎలాంటి పాస్‌లు లేకున్నా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు పద్ధతిగా స్టేడియంలోనే పార్కింగ్ అవకాశం కల్పించారు. దాంతో కుటుంబ సభ్యులతో వచ్చినవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్‌లను ఎంజాయ్ చేయగలిగారు. ఐబీఎల్‌కు ఇతర నగరాల్లో లభిస్తున్న మాదిరిగానే ఇక్కడ కూడా మంచి ఆదరణే కనిపించింది. స్టేడియం పూర్తిగా నిండకపోయినా... పెద్ద సంఖ్యలోనే ప్రేక్షకులు హాజరయ్యారు. స్థానిక ఆటగాళ్లు శ్రీకాంత్, సింధులకు మ్యాచ్‌లలో మంచి మద్దతు లభించింది. ప్రతీ పాయింట్‌కు చప్పట్లతో ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. స్కూల్ విద్యార్థులను కూడా బస్సుల్లో ప్రత్యేకంగా తీసుకు వచ్చారు. -
ఐబీఎల్‌లో పుణే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది
పుణే పిస్టన్స్ (పీపీ) ఐబీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పుణే 3-2తో ముంబై మాస్టర్స్ (ఎంఎం)ను కంగుతినిపించింది. ముంబై ఆటగాడు వ్లాదిమిర్ ఇవనోవ్ సింగిల్స్, డబుల్స్‌లో చక్కని పోరాటం కనబరిచినా... మిగతా మ్యాచ్‌ల్లో సహచరులు ఓడటంతో ముంబై మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఇవనోవ్ (ఎంఎం) 21-16, 21-14తో సౌరభ్ వర్మ (పీపీ)పై అలవోక విజయం సాధించాడు. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో జులియన్ షెంక్ (పీపీ) 11-21, 21-10, 11-7తో టిన్ బౌన్ (ఎంఎం)పై గెలుపొందడంతో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్-ప్రణవ్ చోప్రా (ఎంఎం) జోడి 21-12, 20-21, 11-9తో సనావే థామస్-రూపేశ్ (పీపీ) జంటపై చెమటోడ్చి నెగ్గింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో టిన్ మిన్హ్ (పీపీ) 21-18, 21-13తో మార్క్ జ్వెబ్లెర్ (ఎంఎం)పై విజయం సాధించడంతో స్కోరు 2-2తో సమమైంది. ఐదో మ్యాచ్ (మిక్స్డ్ డబుల్స్)లో అశ్విని పొన్నప్ప-నీల్సన్ (పీపీ) జంట 21-20, 21-13తో సిక్కిరెడ్డి-ప్రణవ్(ఎంఎం) ద్వయంపై నెగ్గి పుణేకు విజయాన్ని అందించింది. -
సింధుకు బంగారు భవిష్యత్తు ఉంది: సైనా నెహ్వాల్
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకం పొందిన భారత షట్లర్ పి.వి.సింధుకు బంగారు భవిష్యత్తు ముందుందని హైదరాబాద్ హాట్‌షాట్స్ క్రీడాకారిణి, భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ చెప్పింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) మొట్టమొదటి మ్యాచ్‌లో సింధును వరుస సెట్లలో ఓడించిన తర్వాత ప్రపంచ నెం.4 ర్యాకంర్ సైనా నెహ్వాల్ మీడియాతో మాట్లాడింది. ఐబీఎల్ తొలి మ్యాచ్‌ని చూసేందుకు భారీగా వచ్చిన ప్రేక్షకులు తన విశ్వాసాన్ని మరింత పెంచినట్లు సైనా చెప్పింది. ''మ్యాచ్ ఆరంభ సమయంలో సింధు నాకు చాలా గట్టిపోటీ ఇచ్చింది. కానీ, జనం నుంచి వచ్చిన ప్రోత్సాహం నాకు చాలా ఉపయోగపడింది. వాళ్ల అంచనాలకు, నా టీమ్ అంచనాలకు తగినట్లుగా ఆడాలని భావించి అక్కడినుంచి బాగా ఆడాను. కానీ సింధు ఆడుతున్న తీరును బట్టి చూస్తుంటే మాత్రం ఆమెకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని నేను కచ్చితంగా చెప్పగలను' అని ఆమె తెలిపింది. ఒలింపిక్స్‌లో భారత దేశానికి కాంస్య పతకం సాధించి పెట్టిన సైనా నెహ్వాల్, తొలి మ్యాచ్‌లో సింధును 21-19, 21-8 తేడాతో వరుస సెట్లలో ఓడించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్సులో హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు, అవధ్ వారియర్స్‌కు మధ్య ఈ పోటీ జరిగింది. -
తొలిపోరులో సైనా గెలుపు
ఢిల్లీ: హోరాహోరీగా సాగిన ఇండియన్ బ్యాడ్మింట్న్ లీగ్ సింగిల్స్ తొలిపోరులో సైనా నెహ్వాల్ 21-19, 21-8 తేడాతో పి.వి. సింధుపై విజయం సాధించి శుభారంభం చేసింది గురువారం జరిగిన గేమ్ లో సైనా రెండు వరుస సెట్లను కైవసం చేసుకుని సింధుకు షాకిచ్చింది. సింధు నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ సైనా అనుభవం ముందు నిలవలేకపోయింది. వీరిద్దరి మధ్య తొలి సెట్ పోటీయే నువ్వా.. నేనా అన్నట్లు సాగినా, రెండో సెట్ ను సైనా అవలీలగా కైవసం చేసుకుంది. ఈ పోరు అసలు సిసలైన ఐబీఎల్ మజాను ప్రేక్షకులకు అందించింది. గోపీచంద్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన ఈ ఇద్దరూ తొలిసారిగా ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్)లో ముఖాముఖి తలపడిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్ లో హైదరాబాద్ హాట్‌షాట్స్ తరపున సైనా నెహ్వాల్ బరిలోకి దిగగా, అవధ్ వారియర్స్ తరపున సింధు పోటీకి సిద్ధమైయ్యారు. -
తొలి సెట్ సైనా నెహ్వాల్ వశం
హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి. సింధు ఇద్దరూ హోరా హోరీగా పోటీపడుతున్నారు. అయితే, తొలి సెట్లో మాత్రం సైనా నెహ్వాల్ అనుభవం ముందు పీవీ సింధు దూకుడు పెద్దగా నిలవలేకపోయింది. తొలి సెట్‌ను సైనా 21-19 తేడాతో గెలుచుకుంది. వీరిద్దరి మధ్య తొలి సెట్ పోటీయే నువ్వా.. నేనా అన్నట్లు సాగింది. అసలు సిసలైన ఐబీఎల్ మజాను ప్రేక్షకులకు అందించింది. గోపీచంద్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన ఈ ఇద్దరూ తొలిసారిగా ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్)లో ముఖాముఖి తలపడుతున్నారు. మహిళల సింగిల్స్ ఏకైక మ్యాచ్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్ తరపున సైనా నెహ్వాల్, అవధ్ వారియర్స్ తరపున సింధు బరిలోకి దిగారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకొని సింధు మంచి జోరు మీద ఉంది. వరుసగా నాలుగోసారీ ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా ఒత్తిడిలో ఉంది. ఈ ఇద్దరి స్టార్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితానికి అధికారిక గుర్తింపు లేకపోయినా, టోర్నీకి హైలైట్ అవుతోంది. -
ఈ సాయంత్రమే సైనా- సింధుల పోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి. సింధు ఇద్దరూ ఈరోజు పోటీపడనున్నారు. గోపీచంద్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన ఈ ఇద్దరూ తొలిసారిగా ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్)లో ముఖాముఖి తలపడనున్నారు. మహిళల సింగిల్స్ ఏకైక మ్యాచ్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్ తరపున సైనా నెహ్వాల్, అవధ్ వారియర్స్ తరపున సింధు బరిలోకి దిగనున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకొని సింధు మంచి జోరు మీద ఉంది. వరుసగా నాలుగోసారీ ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా ఒత్తిడిలో ఉంది. ఈ ఇద్దరి స్టార్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితానికి అధికారిక గుర్తింపు లేకపోయినా, టోర్నీకి హైలైట్ అయ్యే అవకాశం ఉంది. భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్‌తో పోరుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన తరువాత సింధు చెప్పింది. సైనాతో తలపడటానికి సింధు ఆసక్తి కనబరుస్తోంది. అంతే కాకుండా తమ మధ్య జరిగే మ్యాచ్‌లో సైనాను నిలువరించటానికి ప్రయత్నిస్తానని కూడా సింధు సవాల్ విసిరింది. ఈ పరిస్థితులలో వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. వీరిద్దరి పోరు సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. -
ఇబీఎల్ వేలం పై జ్వాలా తీవ్ర అసంతృప్తి