ఐబీఎల్ తొలి సెట్లో సైనా నెహ్వాల్ అనుభవం ముందు పీవీ సింధు దూకుడు నిలవలేకపోయింది. తొలి సెట్ను సైనా 21-19 తేడాతో గెలుచుకుంది.
హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి. సింధు ఇద్దరూ హోరా హోరీగా పోటీపడుతున్నారు. అయితే, తొలి సెట్లో మాత్రం సైనా నెహ్వాల్ అనుభవం ముందు పీవీ సింధు దూకుడు పెద్దగా నిలవలేకపోయింది. తొలి సెట్ను సైనా 21-19 తేడాతో గెలుచుకుంది. వీరిద్దరి మధ్య తొలి సెట్ పోటీయే నువ్వా.. నేనా అన్నట్లు సాగింది. అసలు సిసలైన ఐబీఎల్ మజాను ప్రేక్షకులకు అందించింది.
గోపీచంద్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన ఈ ఇద్దరూ తొలిసారిగా ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబీఎల్)లో ముఖాముఖి తలపడుతున్నారు. మహిళల సింగిల్స్ ఏకైక మ్యాచ్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్ తరపున సైనా నెహ్వాల్, అవధ్ వారియర్స్ తరపున సింధు బరిలోకి దిగారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకొని సింధు మంచి జోరు మీద ఉంది. వరుసగా నాలుగోసారీ ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా ఒత్తిడిలో ఉంది. ఈ ఇద్దరి స్టార్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితానికి అధికారిక గుర్తింపు లేకపోయినా, టోర్నీకి హైలైట్ అవుతోంది.