
సింధుకు బంగారు భవిష్యత్తు ఉంది: సైనా నెహ్వాల్
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకం పొందిన భారత షట్లర్ పి.వి.సింధుకు బంగారు భవిష్యత్తు ముందుందని హైదరాబాద్ హాట్షాట్స్ క్రీడాకారిణి, భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ చెప్పింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) మొట్టమొదటి మ్యాచ్లో సింధును వరుస సెట్లలో ఓడించిన తర్వాత ప్రపంచ నెం.4 ర్యాకంర్ సైనా నెహ్వాల్ మీడియాతో మాట్లాడింది.
ఐబీఎల్ తొలి మ్యాచ్ని చూసేందుకు భారీగా వచ్చిన ప్రేక్షకులు తన విశ్వాసాన్ని మరింత పెంచినట్లు సైనా చెప్పింది. ''మ్యాచ్ ఆరంభ సమయంలో సింధు నాకు చాలా గట్టిపోటీ ఇచ్చింది. కానీ, జనం నుంచి వచ్చిన ప్రోత్సాహం నాకు చాలా ఉపయోగపడింది. వాళ్ల అంచనాలకు, నా టీమ్ అంచనాలకు తగినట్లుగా ఆడాలని భావించి అక్కడినుంచి బాగా ఆడాను. కానీ సింధు ఆడుతున్న తీరును బట్టి చూస్తుంటే మాత్రం ఆమెకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని నేను కచ్చితంగా చెప్పగలను' అని ఆమె తెలిపింది.
ఒలింపిక్స్లో భారత దేశానికి కాంస్య పతకం సాధించి పెట్టిన సైనా నెహ్వాల్, తొలి మ్యాచ్లో సింధును 21-19, 21-8 తేడాతో వరుస సెట్లలో ఓడించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్సులో హైదరాబాద్ హాట్షాట్స్కు, అవధ్ వారియర్స్కు మధ్య ఈ పోటీ జరిగింది.