
ప్రపంచ చాంపియన్‌షిప్‌తో సమానం!
సాక్షి, హైదరాబాద్: తొలి ఏడాదే తన సొంత జట్టు హైదరాబాద్ తరఫున ఆడి ఐబీఎల్‌లో టైటిల్ నెగ్గడం చాలా సంతోషంగా ఉందని హాట్‌షాట్స్ ప్లేయర్ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. టోర్నీ ఈ స్థాయిలో విజయవంతం అవుతుందని తాను ఊహించలేదని ఆమె చెప్పింది. ఐబీఎల్ విజేతగా నిలిచిన హైదరాబాద్ హాట్‌షాట్స్ టీమ్ యాజమాన్యం పీవీపీ గ్రూప్ సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. సైనాతో పాటు టీమ్ కోచ్ రాజేందర్, పీవీపీ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి ఇందులో పాల్గొన్నారు. ‘ఐబీఎల్ నాకో కొత్త అనుభవం. హైదరాబాద్ తరఫున ఆడటంతో పాటు విజేతగా నిలవడంతో నా కల నిజమైనట్లుగా అనిపిస్తోంది. తొలి సారే చాంపియన్‌గా నిలవడం ఆనందంగా ఉంది’ అని సైనా వెల్లడించింది. టోర్నీ మొత్తం తాను దూకుడుగా ఆడానని, సింధుపై నెగ్గేందుకు ప్రత్యేకంగా ఏమీ చేయలేదని సైనా చెప్పింది. ‘సింధుతో పోటీ గురించి పత్రికల్లోనే చదివాను. ఇటీవల ఆమె బాగా ఆడుతోంది. నా సహజశైలిలోనే ఆడి సింధును ఓడించాను. ఆ రెండు రోజులు నావి అని చెప్పగలను. టోర్నీలో నాకు యింగ్ తై జు (బంగా బీట్స్) గట్టి పోటీ ఇచ్చింది. నా దృష్టిలో వరుసగా ఏడు మ్యాచ్‌లు నెగ్గడం వరల్డ్ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లతో సమానంగా అనిపిస్తోంది’ అని ఈ హైదరాబాదీ విశ్లేషించింది. ప్రధానంగా సింగిల్స్ ప్లేయరే అయినా...మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచడంతో సాహసం చేసి మిక్స్‌డ్ డబుల్స్ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నానని, అయితే అదృష్టవశాత్తూ సెమీఫైనల్, ఫైనల్‌లలో తాను ఆడకుండానే జట్టు గెలవడం పట్ల సైనా సంతోషం వ్యక్తం చేసింది. ప్రతీ ఆటగాడికి తన ఫిట్‌నెస్ సామర్ధ్యంపై అవగాహన ఉండాలని చెప్పిన ఈ టాప్ షట్లర్, టోర్నీ షెడ్యూల్ వల్ల తనకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని సంతృప్తి వ్యక్తం చేసింది. తన అభిమాన హీరో షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ను ఇప్పటికే చూశానని, అందులోని లుంగీ డ్యాన్స్‌ను కూడా ప్రయత్నించానని సైనా నెహ్వాల్ సరదాగా చెప్పింది.
ఇది తెలుగువాళ్లందరి జట్టు
గత ఏడాది నవంబర్ 10న ఐబీఎల్ ప్రకటించగానే జట్టు కోసం నిర్వాహకులను కలిసిన తొలి వ్యక్తిని తానేనని, ఇప్పుడు హైదరాబాద్ విజేతగా నిలవడం ఆనందాన్ని రెట్టింపు చేసిందని హాట్‌షాట్స్ యజమాని ప్రసాద్ వి. పొట్లూరి అన్నారు. ‘హాట్‌షాట్స్ జట్టు ప్రతీ తెలుగు వ్యక్తికి చెందింది. ఈ విజయం అందరిదీ. మేం కేవలం నిర్వాహకులం మాత్రమే. క్రీడాభిమానులుగా ఇతర ఆటల్లోకి కూడా విస్తరించాలన్న ఆలోచన ఉంది. బ్యాడ్మింటన్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రాధమిక స్థాయిలో కూడా త్వరలో వేర్వేరు కార్యక్రమాలు చేపట్టనున్నాం’ అని ఆయన చెప్పారు. తొలి ఏడాదే ఐపీఎల్‌లాంటి మెగా ఈవెంట్‌తో పోల్చడం తొందరపాటే అవుతుందని, అయితే ఈ ఏడాది లోపాలు సరిదిద్దుకొని వచ్చే సారి మరింత మెరుగ్గా లీగ్ నిర్వహిస్తామని ప్రసాద్ స్పష్టం చేశారు.