
నగరంలో ఐబీఎల్ సందడి
భారత్‌లో బ్యాడ్మింటన్‌కు చిరునామాగా మారిన హైదరాబాద్‌లో ఐబీఎల్ సందడి మొదలైంది. సోమవారం గ చ్చిబౌలి స్టేడియంలో అవధ్ వారియర్స్, పుణే పిస్టన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సింధు, శ్రీకాంత్ తదితర తెలుగుతేజాలు ఆడటంతో స్టేడియం సందడిగా మారింది.
ప్రేక్షకులు ప్రశాంతంగా...
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటం అంటే అదో పెద్ద యజ్ఞంలాంటిది. సెల్‌ఫోన్లు తీసుకు రావద్దని, పార్కింగ్‌కు అనుమతి లేదని, కనీసం వాటర్ బాటిల్స్‌ను కూడా అనుమతించమని... ఇలా అడుగడుగునా అగ్ని పరీక్షతో ప్రేక్షకులు ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఐబీఎల్ కోసం మాత్రం ఇలాంటి సవాలక్ష నిబంధనలు లేకపోవడం ప్రేక్షకులకు ఓదార్పునిచ్చింది. ఎలాంటి పాస్‌లు లేకున్నా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు పద్ధతిగా స్టేడియంలోనే పార్కింగ్ అవకాశం కల్పించారు. దాంతో కుటుంబ సభ్యులతో వచ్చినవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్‌లను ఎంజాయ్ చేయగలిగారు. ఐబీఎల్‌కు ఇతర నగరాల్లో లభిస్తున్న మాదిరిగానే ఇక్కడ కూడా మంచి ఆదరణే కనిపించింది. స్టేడియం పూర్తిగా నిండకపోయినా... పెద్ద సంఖ్యలోనే ప్రేక్షకులు హాజరయ్యారు. స్థానిక ఆటగాళ్లు శ్రీకాంత్, సింధులకు మ్యాచ్‌లలో మంచి మద్దతు లభించింది. ప్రతీ పాయింట్‌కు చప్పట్లతో ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. స్కూల్ విద్యార్థులను కూడా బస్సుల్లో ప్రత్యేకంగా తీసుకు వచ్చారు.