![దయచేసి ఆ ముద్ర వేయొద్దు: బుమ్రా](/styles/webp/s3/article_images/2017/09/5/71497331837_625x300.jpg.webp?itok=xlS2qLe5)
దయచేసి ఆ ముద్ర వేయొద్దు: బుమ్రా
లండన్: ఇంగ్లండ్ గడ్డపై ఈ సారి చాంపియన్స్ ట్రోఫీలో బంతి అంతగా స్వింగ్ అవకున్నా భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా రాణిస్తున్నారు. అయితే శ్రీలంకతో మ్యాచ్ ఓటమితో బౌలర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నా దాదాపు నాకౌట్ లాంటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించి సఫారీలను కుమ్మేశారు. ఈ మ్యాచ్‌లో విశేషంగా రాణించిన బౌలర్ బుమ్రా.. కెప్టెన్ కోహ్లీ వల్లే ఈ విజయం సాధ్యమైందంటున్నాడు. ఇంగ్లండ్‌లో మొదటిసారి ఆడుతున్నా కోహ్లీ నన్ను నమ్మి కీలక సమయాలలో బంతిని ఇవ్వడంతో పాటు ఒత్తిడి లేకుండా చేశాడని చెప్పాడు.
'భువీని స్వింగ్ కింగ్ అన్నట్లు... నన్ను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అని ముద్ర వేస్తున్నారు. అయితే ఇలాంటి ముద్ర ఏ బౌలర్‌కైనా ప్రమాదకరమే. ఎందుకంటే కెప్టెన్ ఏ సమయంలో బంతి ఇచ్చినా బౌలర్ తన పని నిర్వహించగలడని విశ్వసించాలి. తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై ఆడుతున్నందున సీనియర్లు భువనేశ్వర్, కోహ్లీ, ధోనీ, కోచ్ కుంబ్లే సలహా మేరకు బౌలింగ్ చేసి మంచి ఫలితాలు రాబట్టాను. కోహ్లీ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అందువల్లే నా ప్లాన్స్ చెప్పి అందుకనుగుణంగా బంతులను సంధిస్తూ వికెట్లు సాధిస్తున్నాను. స్వింగ్ విషయంలో మాత్రం భువీని సంప్రదించాను. భువీ సూచన మేరకు లైన్ అండ్ లెంగ్త్ బంతులేసి దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలో పైచేయి సాధించానని' భారత యువ సంచలనం బుమ్రా వివరించాడు.