![Indian Ex Air Hostess Alleged Arjuna Ranatunga Sexually Harassed Her - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/10/arjuna-ranathunga2.jpg.webp?itok=ibuZnd-j)
#మీటూ.. పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని బయటపెట్టే ఆయుధంగా మారింది. సినీ, జర్నలిజం రంగాల్లో పెద్దలుగా గుర్తింపు పొందిన ఎంతో మంది ( ఉదా : నానా పటేకర్, వైరముత్తు, ఎంజే అక్బర్) అసలు సిసలు వ్యక్తిత్వాన్ని బట్టబయలు చేస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ రెండు రంగాలకు చెందిన ప్రముఖుల వేధింపులే బయటికి రాగా.. క్రీడా రంగంలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారంటూ గుత్తా జ్వాల తన #మీటూ స్టోరిని బహిర్గతం చేశారు. తాజాగా ఓ ఎయిర్‌హోస్టెస్ శ్రీలంక మాజీ క్రికెటర్, కెప్టెన్ అర్జున రణతుంగ తనతో వ్యవహరించిన తీరు గురించి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.
#రణతుంగ..
‘ముంబైలోని హోటల్ జూహు సెంటర్ ఎలివేటర్‌లో ఇండియన్, శ్రీలంక క్రికెటర్లు ఉన్నారని తెలిసి నా స్నేహితురాలు ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వెళ్దామని పట్టుపట్టింది. అలా ఆమెతో పాటుగా నేను కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ కాసేపటి తర్వాత తను స్విమ్మింగ్‌పూల్ వైపుగా పరిగెత్తింది. నేను కూడా తనని అనుసరించాను. తర్వాత తను మాయమైపోయింది. అయితే అప్పుడే హోటల్ రూం నుంచి బయటికి వచ్చిన రణతుంగ స్విమ్మింగ్‌పూల్ దగ్గర నిలబడి ఉన్నాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేను కూడా విష్ చేశాను.
కానీ అంతలోనే నాకు అతి సమీపంగా వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. వికృత చేష్టలతో నన్ను చుట్టేశాడు. నాకు చాలా భయం వేసింది. కానీ వెంటనే తేరుకుని అతడిని వదిలించుకునేందుకు గట్టిగా తన్నడం మొదలుపెట్టాను. నీ పాస్‌పోర్టు క్యాన్సిల్ చేయిస్తా, పోలీసులకు చెబుతా అంటూ అరిచాను. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని హోటల్ రిసెప్షన్‌లో కంప్లైంట్ చేశాను. కానీ ఇది మీ ప్రైవేట్ మ్యాటర్. మేమేం చేయలేమంటూ సిబ్బంది చేతులెత్తేశారు’ అంటూ అర్జున రణతుంగ తనతో ప్రవర్తించిన తీరును #రణతుంగ పేరిట తన మీటూ స్టోరీని ఇండియన్ ఎయిర్‌హోస్టెస్ బహిర్గతం చేశారు.
కాగా శ్రీలంకకు వరల్డ్ కప్(1996) అందించిన కెప్టెన్‌గా రికార్డుకెక్కిన అర్జున రణతుంగ ప్రస్తుతం ఆ దేశ పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment