జీవితంలో కష్టాలు.. మైదానంలో బంగారాలు | Indian Girls Shines In Asian Games 2018 | Sakshi
Sakshi News home page

జీవితంలో కష్టాలు.. మైదానంలో బంగారాలు

Published Mon, Sep 3 2018 5:16 PM | Last Updated on Mon, Sep 3 2018 5:16 PM

Indian Girls Shines In Asian Games 2018 - Sakshi

నిన్నటితో ‘దంగల్‌’ ముగిసింది. దంగల్‌ అంటే.. తెలిసిందే, కుస్తీ! పతకం కోసం కుస్తీ.. పరువు కోసం కుస్తీ.ఊరికే కుస్తీ పడితే పతకం వస్తుందా? పరువు పతాకమై ఎగురుతుందా?! ప్రత్యర్థిని పడగొట్టాలి.. విజేతగా.. నిలబడాలి! ఈసారి ఏషియన్‌ గేమ్స్‌లో.. అమ్మాయిలదే దంగల్‌ అంతా! అది కాదు విషయం.. జీవితంతో కుస్తీ పడి వచ్చినవాళ్లే అంతా! లేమి లోంచి మెరిసిన ఈ మేలిమి బంగారాలు ఇప్పుడు మన దేశానికి.. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్‌లను మించిన త్రివర్ణ ‘పతకాలు’!!

2018, జకార్తా ఏషియన్‌ గేమ్స్‌.. మన అమ్మాయిల దమ్ము చూపించింది. దుమ్ము రేపింది! ఈ ఆటల్లో మెడల్స్‌ సాధించిన చాలామంది అమ్మాయిలు కలిమిలోంచి వచ్చినవాళ్లు కాదు. మధ్యతరగతి, ఇంకా చెప్పాలంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లు. ఆర్థిక బాధ్యతలను పంచుకుంటూ ఇంటి పరువునే కాదు, దేశ కీర్తినీ మోస్తున్న క్రీడాబలులు. జీవితంలోని హార్డిల్స్‌నూ అదే స్పిరిట్‌తో దాటుతున్న ఆ చిరుతలు తమ గెలుపుతో ప్రభుత్వ కర్తవ్యాన్నీ గుర్తుచేస్తున్నారు. 

మైదానంలో మాణిక్యాలు
వినేశ్‌ ఫోగత్, చిత్రా ఉన్నికృష్ణన్, స్వప్నా బర్మన్, ద్యుతి చంద్, మలప్రభ జాధవ్, దివ్యా కక్రన్, హిమాదాస్, సరితాబెన్‌ లక్ష్మణ్‌ గైక్వాడ్, హర్షితా తోమర్, పింకీ బల్హారా.. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం! వినేశ్‌ ఫోగత్‌.. ఈ గేమ్స్‌లో మనదేశ మహిళా రెజ్లర్ల బలం చూపించింది.. 50 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సంపాదించి! ఆమె మహావీర్‌ సింగ్‌ ఫోగత్‌కు స్వయానా తమ్ముడి బిడ్డ. మహావీర్‌ కూతుళ్లు గీత, బబితాలతో సమానమైన కుస్తీ మెళకువలున్నా గ్లాస్‌గో, స్కాట్లాండ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో విజయం సాధించినా పెద్దనాన్న పంచన నీడగానే ఉండిపోయింది. ఈసారే ఫోగత్‌ అనే ఇంటిపేరుతోనే కాక వినేశ్‌ అనే బంగారం కాంతితో మీడియాలో బ్యానర్‌ అయింది. 

వినేశ్‌ ఫోగత్‌కు అయిదేళ్లున్నప్పుడే తండ్రి రాజ్‌పాల్‌ ఫోగత్‌ చనిపోయాడు. ఫోగత్‌కు ఒక చెల్లి, తమ్ముడు. తల్లే ఆ ముగ్గురిని పెంచి పెద్ద చేసింది. తర్వాత వినేశ్‌ను మహావీర్‌ ఫోగత్‌ దత్తత తీసుకున్నాడు. తన బిడ్డలతోపాటుగా వినేశ్‌కూ కుస్తీ నేర్పాడు. పెళ్లి చేసి పంపకుండా ఆడపిల్లలకు కుస్తీపట్టడం నేర్పిస్తున్నాడు అంటే అత్తింట్లో జుట్టుపట్టుకొని పోట్లాడమనా అంటూ ఊరి (భివాణి, హర్యానా) పెద్దలు, కులస్థులు హేళన చేశారు, వెలివేశారు. అయినా ఫోగత్‌ పట్టుబట్టి ఆడపిల్లలను కుస్తీ వీరులుగా తయారు చేశాడు. అలా బతుకు యుద్ధాన్నీ నేర్చుకుంది వినేశ్‌. వాటిన్నిటినీ రింగ్‌లో ప్రత్యర్థిని నిలువరించేందుకు ప్రయోగిస్తోంది వినేశ్‌!

చిత్రా ఉన్నికృష్ణన్‌ స్టోరీ సింపులేం కాదు.. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా, మందూరు ఆమె స్వస్థలం. చిత్రకు ఊహ తెలిసేటప్పటికే ఆకలి కడుపుతోనే ఆడుకోవడం అలవాటైంది. ఆమె తల్లిదండ్రులు కూలీలు. ఇద్దరూ కష్టడితేనే ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబానికి రెండు పూటలా తిండి దొరికేది. అర్ధాకలితో నిద్ర పోయిన రోజులే ఎక్కువ. పొట్టలో ఎలుకలు రన్నింగ్‌ రేస్‌ పెట్టుకొని రాత్రంతా కంటికి మీద కునుకుకు దూరం చేసినా పొద్దున్నే అయిదున్నరకల్లా తను చదువుకునే సర్కారు బడిలోని గ్రౌండ్‌కు పరుగెత్తేది. ఆ పట్టుదలే మొన్నటి ఏషియన్‌ గేమ్స్‌లో బ్రౌంజ్‌ మెడల్‌ వచ్చేలా చేసింది. ఆకలిని జయించింది. ఆత్మవిశ్వాసంతో విధిరాతను మార్చుకుంది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో జయమే ధ్యేయంగా ప్రాక్టీస్‌ను ట్రాక్‌లో పెడుతోంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వప్న బర్మన్‌.. హెపథ్లాన్‌లో బంగారు పథకం సాధించింది. ఈ అమ్మాయి కూడా పేదరికం ఫ్రెండ్‌షిప్‌తోనే పెరిగింది. తండ్రి పంచన్‌ బర్మన్‌ ఆటోడ్రైవర్‌. తల్లి బసనా టీ జల్‌పాయ్‌గురిలోని టీ ఎస్టేట్‌లో కూలీ. స్వప్నకు గోల్డ్‌మెడల్‌ వచ్చిందని తెలియగానే ఒక విషయాన్ని తలుచుకొని ఆ అమ్మ కంటతడి పెట్టింది. ‘‘అథ్లెట్స్‌కి బలమైన తిండి పెట్టాలి. పౌష్టికాహారం కాదు కదా నా బిడ్డకు కడుపునిండా కూడా తిండిపెట్టలేదు నేను’’ అంటూ! అయినా ఆ అమ్మాయి అమ్మ మీద అలగలేదు. నాకీ పరిస్థితి ఏంటీ అని కాళ్లు నేలకేసి కొట్టలేదు. ఆకలితో పరుగుపందెం పెట్టుకుంది. దానికి ఎప్పటికీ దొరకనంత దూరానికి వచ్చేసింది. 

ఒడిషా అమ్మాయి ద్యుతి చంద్‌కు హండ్రెడ్‌ మీటర్స్‌ రేస్‌లో సిల్వర్‌ మెడల్‌ వచ్చింది. మెడల్స్‌కన్నా టఫ్‌గేమ్‌ అయిన ఆత్మబలాన్ని దెబ్బతీసే సమస్యతో పోరాడి గెలిచింది ఆమె ఆ సక్సెస్‌ ముందు ఈ పథకాలు చిన్నవే. కాని ఆడడానికే ఆ పోరు నెగ్గింది కాబట్టి ఈ విజయం ద్యుతికి అమూల్యమైనదే. చేనేత కార్మికుల ఇంట ఏడుగురు సంతానంలో మూడో అమ్మాయిగా పుట్టింది ద్యుతి. ఆమె బాల్యమూ గొప్పగా ఏమీ గడవలేదు. అక్క సరస్వతి.. నేషనల్‌ లెవెల్‌ అథ్లెట్‌. ఆమె స్ఫూర్తితోనే ద్యుతి కూడా అథ్లెట్‌ అయింది. పదిహేడేళ్లకే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. విజయపరంపరతో దూసుకెళ్తున్న ద్యుతి లండన్‌ ఒలింపిక్స్‌లో కూడా పార్టిసిపేట్‌ చేయాల్సి ఉండింది. అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్యుతి మీద వైద్య పరీక్షలు మొదలుపెట్టింది కారణం ఆమెకు  చెప్పకుండానే. చివరకు ‘జెండర్‌ టెస్ట్‌’లో ఫెయిల్‌ అయినందుకు ఒలిపింక్స్‌లో పాల్గొనే చాన్స్‌ లేదని, నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ కూడా వదులుకోవాలని చెప్పారు ఆమెతో. ఆ మాట ఆమెను అచేతనం చేసింది. జెండర్‌టెస్ట్‌లో ఫెయిలవడానికి దారితీసిన ఆమె శారీరక పరిస్థితిని హైపర్‌ఆండ్రోనిజమ్‌ అంటారు. సాధారణ మహిళల్లో ఉండే కంటే ఎక్కువ పాళ్లలో ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్‌ హర్మోన్లు ఆమె శరీరంలో ఉన్నాయి. ఈ స్థితిలో ఆమె స్త్రీలకు సంబంధించిన అథ్లెట్స్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఆమెకు రెండే దారులు. ఒకటి.. ఆటలకు శాశ్వతంగా దూరం కావడం, రెండు.. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీకి వెళ్లి ఆండ్రోజెన్‌ హర్మోన్‌ లెవెల్స్‌ను తగ్గించుకోవడం. అయితే ద్యుతి మూడో ఆప్షన్‌ను ఎన్నుకుంది. అలాంటి టెస్ట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని. తనకు ఎదురైంది ఇంకే అమ్మాయికి ఎదురు కావద్దని. గెలిచింది. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఆమెది గెలుపు దారే! 

మలప్రభా జాధవ్‌.. రైతు బిడ్డ. కర్ణాటకలోని తుర్మూరు ఆమె జన్మస్థలం. జూడో కేటగిరీ  కురాష్‌లో కాంస్య పథకం సాధించింది. ‘‘కురాష్‌ అనే ఒక ఆట ఉంటుందని కూడా నాకు తెలియదు. అమ్మాయిలకు ఈ ఆట వస్తే చాలా మంచిది. మీ అమ్మాయి చాలా చురుగ్గా ఉంది. నేర్పించండి అని కోచ్‌ చెబితే సర్లే స్కూల్లోనే కదా నేర్పిస్తున్నారు అని చేర్పించా’’ అన్నాడు మలప్రభ తండ్రి యెల్లప్ప జాధవ్‌. ఇప్పుడు కూతురు మెడల్‌ కొట్టిందని తెలియగానే ఆయన ఆనందానికి అంతులేదు. అన్నట్టు మలప్రభ తుర్మూరు పక్కనుంచే పారే ఒక నది. ఆ పేరే కూతురికి పెట్టుకున్నాడు యెల్లప్ప. తగ్గట్టుగానే ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటుంది మలప్రభ. 
 

దివ్యాకక్రన్‌..  మహిళల ఫ్రీస్టయిల్‌ 68 కేజీల రెజ్లింగ్‌ పోటీల్లో బ్రౌంజ్‌ మెడల్‌ తెచ్చుకుంది. ఢిల్లీలో పుట్టిపెరిగిన దివ్యా దిగివ మధ్యతరగతి కుటుంబం. నాయి సామాజికవర్గం. తల్లి లంగోటాలు కుడితే.. తండ్రి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరకొర వసతులతో అడ్జస్ట్‌ అవుతూ స్పోర్ట్స్‌లో సత్తా చూపుతోంది దివ్యా. స్పోర్ట్స్‌కోటాలోనే నోయిడా కాలేజ్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బ్యాచలర్స్‌ డిగ్రీ చేస్తోంది.

హిమాదాస్‌.. జకార్తా ఏషియన్‌ గేమ్స్‌ కన్నా ముందే ప్రాచుర్యంలోకి వచ్చిన అథ్లెట్‌. అస్సాంలోని నాగోన్‌ జిల్లా,  కంధులిమరి అనే ఊళ్లో పుట్టింది. తండ్రి రొంజిత్‌ దాస్, జొనాలి దాస్‌ తల్లిదండ్రులు. రైతులు. అయిదుగురు పిల్లల్లో ఆఖరు సంతానం హిమాదాస్‌. ఈశాన్య రాష్ట్రాలంటే మిగతా దేశానికి ఉన్న చిన్నచూపు, ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ ఎదుర్కొంది హిమా. ముందు ఫుట్‌బాల్‌ అంటే ఆసక్తి చూపింది. బాగా ఆడేది కూడా. కాని మన దగ్గర ఫుట్‌బాల్‌ పట్ల అనాదరణ, అసలు మహిళా టీమ్‌ అన్న జాడే లేకపోవడంతో అథ్లెటిక్స్‌ వైపు మొగ్గు చూపింది. విజయాల ట్రాక్‌ మీద ఉరుకుతూ మొన్నటి ఏషియన్‌ గేమ్స్‌లో మహిళల 400 మీటర్స్‌ డెస్టినేషన్‌లో సిల్వర్‌ సాధించింది. 

సరితాబెన్‌ లక్ష్మణ్‌భాయి గాయక్‌వాడ్‌.. గుజరాత్‌కు చెందిన ట్రైబల్‌ గర్ల్‌. దుగా జిల్లాలోని ఖరాది అంబ స్వగ్రామం. పేదింటి పిల్ల. ఏషియన్‌గేమ్స్‌లో పాల్గొనేందుకు అరకొర డబ్బుల్తోనే జకార్తా వచ్చింది. డబ్బు సరిపోవట్లేదని గుజరాత్‌లో తెలిసిన వాళ్లకు ఫోన్‌ చేస్తే వాళ్లు డబ్బు పంపారు. ఈ గేమ్స్‌లో  4 ఇంటూ 400 రిలేలో గోల్డ్‌ మెడల్‌ తెచ్చిపెట్టింది.

పింకీ బల్హారా... ఢిల్లీ అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం. జూడో అంటే ఇష్టం. ఈ ఏషియన్‌ గేమ్స్‌లో కురాష్‌లో రజత పథకం సాధించింది. ప్రాక్టీస్‌ మొదలుపెట్టినప్పటి నుంచీ హార్డిల్సే. ఉమ్మడి కుటుంబంలో కజిన్‌ చనిపోయాడు. ఆ తర్వాత  హఠాత్తుగా తండ్రి చనిపోయాడు. ఆ విషాదాన్ని పిడికిలిలో బిగించి రింగ్‌లోకి వచ్చింది. కొడుకు పోయాడన్న దిగులుతో పింకీ తాత (తండ్రి తండ్రి) చనిపోయాడు. ఈ విషయాన్ని పింకీకి చెప్పకుండా దాచారు ఇంట్లోవాళ్లు. ఆమె పోటీలో నెగ్గాక విషయం చెప్పారు. పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువన పెట్టి పథకం తెచ్చింది. కూతురికి తోడుగా జకార్తా వెళ్లాలనుకున్నాడు పింకీ వాళ్ల నాన్న. ఆమె గెలుపు చూడకుండానే వెళ్లిపోయాడు. కండబలంతో మైదానాన్ని ఓడిస్తూ .. గుండెబలంతో జీవితాన్ని విన్‌ అవుతున్నారు వీళ్లంతా! బతుకు  పోడియం ఎక్కి  సమాజం సృష్టించిన తారతమ్యాలు తలదించుకునేలా చేస్తున్నారు.  ఈ సామర్థ్యాన్ని ఇంకా పరీక్షించొద్దు. ఈ ప్రతిభకు ఇంకా పోటీలు పెట్టొద్దు. ఎన్ని అడ్డంకులున్నా దీక్షకు అడ్డురావని చూపారు. ఆటలు అనగానే ఒక సానియా, ఒక సైనా.. ఒకే ఒక సింధు కాదు.. ఏషియన్‌ గేమ్స్‌లో ఇండియా జెండా ఎగరేసిన చాలామంది క్రీడాకారిణులున్నారు. స్పాన్సర్‌షిప్స్‌కు ఒక టెన్నిస్‌.. ఇక  స్వా్కషే కాదు.. అథ్లెటిక్స్‌ కూడా ఉంటాయి. ఆటలను గ్లామర్‌ హంగులతో కాదు... స్పోర్టివ్‌ స్పిరిట్‌తో చూద్దాం! వీళ్ల జీవితాలను ట్రాక్‌ మీదకు తెద్దాం! 
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement