‘పేస్’ పదును పెంచాలి
జైపూర్‌లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత ప్రదర్శన ప్రతీ అభిమానిని ఆనందంలో ముంచెత్తింది. తిరుగులేని మన బ్యాటింగ్ లైనప్ అందించిన అపూర్వ విజయమిది. తాజా ప్రదర్శనతో 2015లో వన్డే ప్రపంచ కప్‌ను భారత్ నిలబెట్టుకునేందుకు కావాల్సిన సత్తా యువ ఆటగాళ్లలో ఉందని అందరూ ముక్తకంఠంతో అంగీకరిస్తున్నారు. అయితే టీమిండియా చిరస్మరణీయ విజయాలలో ఎక్కువ భాగం బ్యాటింగ్ కారణంగానే వచ్చినవనేది వాస్తవం. మరి బౌలింగ్ సంగతో...! ఆస్ట్రేలియా గడ్డపై విజయాలు దక్కాలంటే బ్యాటింగ్ బలమొక్కటే కాదు, పేస్ బలగం కూడా ఎంతో కీలకం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీర్చి దిద్దుతున్నామంటున్న భారత జట్టులో సత్తా ఉన్న పేసర్లు ఎంత మంది? రాబోయే ఏడాదిన్నర పాటు నిలకడగా ఆడి నిలబడగల సామర్థ్యం వీరిలో ఉందా?
సాక్షి క్రీడా విభాగం
వచ్చే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఆటగాళ్లకు తగిన అవకాశాలు కల్పిస్తున్నామని, అందుకోసమే కొత్త ప్రయోగాలు చేస్తున్నామని టీమిండియా మేనేజ్‌మెంట్ చెబుతోంది. సురేశ్ రైనాను నాలుగో స్థానంలో ఆడించడం కూడా అందులో భాగమేనని ధోని స్వయంగా వెల్లడించాడు. మరి ఇదే తరహా వ్యూహాలు బౌలింగ్‌లోనూ ప్రయత్నిస్తున్నారా అంటే వెంటనే సమాధానం లభించదు.
పుణేలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ ఇన్నింగ్స్ ఆసాంతం గంటకు 155 కిమీ.లకు తగ్గని వేగంతో బౌలింగ్ వేశాడు. భారత గడ్డపై ఇలా ఉంటే ఆస్ట్రేలియాలో అతని వేగం ఎలాంటిదో ఊహించుకోవచ్చు. మరోవైపు మన మీడియం పేసర్లు మాత్రం ఏ దశలోనూ 135 కి.మీ. దాటడం లేదు. ఆస్ట్రేలియాలో ఇక్కడి తరహాలో భారీ స్కోర్లు ఎక్కువగా నమోదు కావు. విజయం కోసం బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా సమానంగా బాధ్యత మోయాల్సి ఉంటుంది.
స్వింగ్ సరిపోదు...
‘మన వద్ద అసలు సిసలు పేస్ బౌలర్లు లేరు. ఉన్నదల్లా స్వింగ్ బౌలర్లే. కాబట్టి ఆసీస్ బౌలర్ల తరహాలో బౌన్స్ రాబట్టలేం’ అని ఇటీవల ధోని చెప్పాడు. అయితే భువనేశ్వర్, వినయ్ కుమార్‌లాంటి బౌలర్ల స్వింగ్ ఇంగ్లండ్‌లాంటి చోట అద్భుతంగా పని చేస్తుంది. కానీ ఆస్ట్రేలియాలో కావాల్సింది వేగం, బౌన్స్ రాబట్టగల సామర్థ్యం. అక్కడి పరిస్థితుల్లో షార్ట్ ఆఫ్ లెంత్ బంతితో అద్భుతాలు చేయవచ్చు. బౌన్స్‌ను రాబట్టాలంటే కావాల్సింది మంచి ఎత్తు, బలమైన భుజాలు, మణికట్టును ఎక్కువగా ఉపయోగించగలగడం. అందుబాటులో ఉన్న బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లకే ఆ సామర్థ్ధ్యం ఉంది. ఎత్తు ఎక్కువగా లేకపోయినా బలమైన భుజాలు, మణికట్టుతో ఆకట్టుకున్న ఉమేశ్ ఇప్పుడు జట్టులో లేడు. ఇక భారత్ ‘ప్రధాన బౌలర్’గా తనకు తాను ప్రకటించుకున్న ఇషాంత్ వన్డేల్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. అటు ప్రారంభ ఓవర్లలో, ఇటు చివరి ఓవర్లలో కూడా అతని ప్రదర్శన నాసిరకంగా ఉంది. తన 67 వన్డేల కెరీర్‌లో తొలి 15 ఓవర్లలో 45.34 సగటుతో వికెట్లు తీసిన అతను...చివరి పది ఓవర్లలో ఓవర్‌కు 7.38 పరుగుల చొప్పున సమర్పించుకుంటున్నాడు. షమీ, ఉనాద్కట్, ఆరోన్, మోహిత్ శర్మ, దిండా...వీరిలో ఎవరు ఎంత కాలం నిలబడగలరో చూడాలి.
ఆడలేక మద్దెల ఓడు...
మరోవైపు అసలైన పేసర్లు అందుబాటులో లేని బీసీసీఐ, తాజాగా ‘రెండు బంతుల నిబంధన’ను వ్యతిరేకిస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తోంది. ఈ నిబంధనతో స్పిన్నర్లు ఇబ్బంది పడుతున్నారనే వాదన అర్ధ రహితం. బంతి కొత్తగానే ఉన్నా జడేజా, యువరాజ్‌లాంటి స్పిన్నర్లు మంచి ఫలితాలు రాబడుతున్నారు. వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో స్పిన్నర్లే ఎక్కువ మంది ఉండటం గమనార్హం.
ఇతర జట్లు రెండు బంతులను సమర్థ్ధంగా వాడుతుండగా, ఆ అవకాశం లేక దానిని తొలగించాలని మన బోర్డు కోరుతోంది. వాస్తవంగా చూస్తే బీసీసీఐ కేవలం బ్యాట్స్‌మెన్ ప్రయోజనాలతోపాటు, ఒకవైపు మాత్రమే పదును ఉన్న మన పేస్ బౌలింగ్‌ను రక్షించే ప్రయత్నం చేస్తోంది. నిబంధనల మార్పు గురించి పట్టుదలకు పోకుండా మన పేస్ బలాన్ని పెంచేందుకు బోర్డు దృష్టి పెట్టాలి. అప్పుడే మనం మళ్లీ వరల్డ్ కప్ గెలవడంపై ఆశలు పెంచుకోవచ్చు. లేదంటే 1992 అనుభవం పునరావృతం కావచ్చు.