'ఇది నంబర్ వన్ బౌలింగ్ కాదు'
పుణె: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత్ జట్టు ఘోర ఓటమి అనంతరం విమర్శల వర్షం కురుస్తోంది. ఒకవైపు ఎటువంటి అంచనాలు లేకుండా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా స్పిన్నర్ ఓకీఫ్ చెలరేగిపోతే, మన స్పిన్నర్లు పూర్తిస్థాయి ప్రదర్శన ఎందుకు చేయలేదనే దానిపై పలువురు విశ్లేషకులు మండిపడుతున్నారు. ఆ మ్యాచ్ లో భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని అంటున్నాడు మాజీ దిగ్గజ స్పిన్నర్ మణిందర్ సింగ్. అశ్విన్ కేవలం సాధారణ బౌలింగ్ కే పరిమితమయ్యాడు తప్పా, ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయడంలో విఫలమయ్యాడని పేర్కొన్నాడు. అశ్విన్ బౌలింగ్ బాగా చేయలేదనే విషయం క్లియర్ గా కనబడుతుందని మణిందర్ సింగ్ తెలిపాడు.
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఓకీఫ్ కేవలం బేసిక్స్ తోనే వికెట్లను సాధిస్తే, స్టార్ స్పిన్నర్ అయిన అశ్విన్ మాత్రం బంతిని సరైన ప్రదేశంలో సంధించడంలో విఫలమయ్యాడన్నాడు. మనకు మ్యాచ్ విన్నర్ అయిన అశ్విన్ పరిస్థితులకు తొందరగా అలవాటు పడి వికెట్లు తీయడానికి యత్నించాల్సి ఉండాల్సిందన్నాడు. ఇక్కడ అశ్విన్ కు కోచ్ అనిల్ కుంబ్లే ఏమైనా సలహా ఇచ్చే ఉంటే బాగుండేదన్నాడు. వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అయిన అశ్విన్ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇది కాదని మణిందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్ లో వికెట్లు తీసే ఉత్సుకతతో మన స్పిన్నర్లు బౌలింగ్ చేయలేనట్లుగానే తనకు కనబడిందన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో వికెట్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలిస్తున్నప్పుడు సహనంతో కూడిన బౌలింగ్ ను మన స్పిన్నర్లు చేసి ఉంటే బాగుండేదన్నాడు.