
భవిష్యత్‌కు దిక్సూచి!
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.
• కోచ్ పాత్రలో విశేషంగా రాణిస్తున్న రాహుల్ ద్రవిడ్
• భారత యువ జట్లకు చక్కటి మార్గనిర్దేశనం
• కుర్రాళ్ల వరుస విజయాల్లో కీలకపాత్ర
దాదాపు ఏడాదిన్నర క్రితం బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ సలహా కమిటీని ప్రకటించింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఇందులో సభ్యులు. ఈ జాబితా చూసిన ప్రతి ఒక్కరికీ ఒకటే సందేహం.. ఇందులో రాహుల్ ద్రవిడ్ ఎక్కడ అని. అయితే నాలుగు గోడల మధ్య కూర్చుని ఏవో సలహాలు ఇవ్వడం ఈ మిస్టర్ డిపెండబుల్‌కు నచ్చని పని. అందుకే భారత క్రికెట్ భవిష్యత్ వెలిగిపోవాలంటే ఓ మాజీ ఆటగాడిగా తానేమి చేయగలనో బోర్డుకు స్పష్టంగా సంకేతాలు పంపారు. ఫలితంగా భారత్ ‘ఎ’, అండర్–19 కోచ్‌గా ద్రవిడ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. బరిలోకి దిగడమే ఆలస్యం యువ క్రికెటర్ల ఆటకు మెరుగులు దిద్దడమే కాకుండా మంచి ఫలితాలతో భారత క్రికెట్‌కు భరోసా ఇచ్చే పనిలో బిజీ బిజీగా ఉన్నారు.
కరుణ్ నాయర్‌పై ద్రవిడ్ ప్రభావం
ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన చివరి టెస్టులో తన మూడో మ్యాచ్‌లోనే కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ అసమాన బ్యాటింగ్ తీరుపై రాహుల్ ద్రవిడ్ ప్రభావాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే ఐపీఎల్‌లో నాయర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు. ఆ జట్టుకు మెంటార్‌గా ద్రవిడ్ వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఇండియా ‘ఎ’ తరఫున కూడా ఆడాడు. అక్కడా కోచ్ ద్రవిడే. దీంతో ఐపీఎల్‌లో కానీ, నెట్స్‌లో కానీ ద్రవిడ్‌తో ఎక్కువ సాన్నిహిత్యం నాయర్‌కు కలిగింది. తన బ్యాటింగ్ బలహీనతలను ఆయనతో పంచుకుని లోపాలను సరిదిద్దుకున్నాడు. తద్వారా ఈ కర్ణాటక ఆటగాడు ఐపీఎల్‌లోనూ మెరుగ్గా రాణించి అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుకున్నాడు.
సాక్షి క్రీడా విభాగం
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు భారత ‘ఎ’ జట్టు ఆయన ఆధ్వర్యంలోనే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్లతో జరిగిన ముక్కోణపు సిరీస్‌ను కైవసం చేసుకుంది. నిజానికి ఈ ఆటగాళ్లలో చాలామందికి రంజీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. వారికి శిక్షణపరంగా పెద్దగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ‘ప్రాథమిక స్థాయి శిక్షణ వారికి అవసరం లేదు. నా ఉద్దేశం కూడా వారికి పాఠాలు చెప్పడం కాదు. నిజానికి ఎలా ఆడాలో వారికి చెప్పాల్సిన అవసరం లేదు. వారు సమర్థులు కాబట్టే జట్టులో ఉన్నారు. కాకపోతే వారిని మరింత మెరుగైన స్థాయికి తీసుకొచ్చేందుకు తగిన మార్గనిర్దేశనం అవసరం’ అని ద్రవిడ్ అప్పట్లో చెప్పారు.
అయితే ద్రవిడ్‌కు అసలు సిసలు పరీక్ష అండర్–19 ప్రపంచకప్‌లోనే ఎదురైంది. తన సత్తాకు ఈ టోర్నీ సవాల్‌గా నిలిచింది. ఎలాగైనా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆటగాళ్లు కలలు కనే వయస్సు అది. వీరిని అత్యంత నైపుణ్యం కలిగిన ఆటగాళ్లుగా తీర్చిదిద్దితేనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి బృహత్తర బాధ్యత తనపైనే ఉండగా దీనికి తగ్గట్టుగానే ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఆ జట్టు అద్భుత ఫలితాలు సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు వెళ్లి రన్నరప్ కాగలిగింది. కుర్రాళ్ల ఆటతీరులోనూ గణనీయంగా మార్పు కనిపించింది.
ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, అర్మాన్ జాఫర్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్ విశేషంగా ఆకట్టుకున్నారు. ‘పరాజయమనేదే లేకుండా ప్రతీసారి విజయం సాధించడం గురించి మనం ఆలోచించకూడదు. ఈ సమయంలో మీకు ఓటమి రావడం మంచిదే. అయితే మున్ముందు ఎదురయ్యే సవాళ్ల కోసం మాత్రం ఇప్పటి నుంచే సిద్ధం కండి’ ఇదీ అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి అనంతరం జట్టుకు ద్రవిడ్ చెప్పిన మాటలు.
కొత్త కుర్రాళ్లతో బరిలోకి...
శుక్రవారం శ్రీలంకలో ముగిసిన అండర్–19 ఆసియా కప్‌లో మాత్రం భారత్ పూర్తిగా కొత్త కుర్రాళ్లతో బరిలోకి దిగింది. ప్రతీ ఆటగాడికి ఆడే అవకాశం రావాలనే ముందుచూపుతో ఆలోచించిన కోచ్ ద్రవిడ్ సూచనల ప్రకారం సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన సలహాపైనే ఏ ఆటగాడు కూడా రెండు అండర్–19 ప్రపంచకప్‌లు ఆడకూడదని బీసీసీఐ ఈ ఏడాది జూన్‌లో నిర్ణయం తీసుకుంది. దీంతో 2018లో జరిగే ఈ మెగా టోర్నీకి సన్నద్ధం కావాలంటే ఆసియా కప్‌ను మంచి అవకాశంగా భావించారు. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో పాకిస్తాన్ కూడా ఇలాగే ప్రపంచకప్ ఆడిన అనుభవంలేని ఆటగాళ్లతోనే ఆడింది. అయితే పాక్ జట్టు అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడి లీగ్ దశలోనే వెనక్కి వెళ్లింది. అయితే కొత్త ఆటగాళ్లయినా భారత్ మాత్రం దుమ్ము రేపింది. 2012 నుంచి వరుసగా మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. పృథ్వీ షా, హిమాన్షు రాణా, అభిషేక్ శర్మ వెలుగులోకి వచ్చారు.
అయితే దీనికి ముందు ద్రవిడ్ ఈ టోర్నీకి తగిన ప్రణాళికలతో సిద్ధమయ్యారు. ఇందుకు వీడియో విశ్లేషకుడు దేవరాజ్ రౌత్ సహాయం తీసుకున్నారు. భారత్ ఆడే మ్యాచ్ మొత్తాన్ని ఆయన చిత్రీకరించి అందులోంచి కొన్ని భాగాలను ఎడిట్ చేసి వారి ఆటతీరును పరిశీలించుకునేందుకు ప్రతీ ఆటగాడికి ఇచ్చేవారు. దీంతో తాము ఎక్కడ తప్పులు చేస్తున్నామనే విషయం వారికి బోధపడి దానికి అనుగుణంగా మార్పులు చేసుకున్నారు. అందుకే కొలంబో బయలుదేరడానికి కొద్ది రోజుల ముందు ఏడుగురు ఆటగాళ్ల వయస్సు విషయం వివాదాస్పదమై అప్పటికప్పుడు ఇతర ఆటగాళ్లు జట్టులో చేరినా ద్రవిడ్ పక్కా వ్యూహంతో వెళ్లడంతో ఇబ్బంది కాలేదు. అంతేకాకుండా ఈ టోర్నీ కోసం ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు ప్రతీ జోన్‌లో అండర్–16, 19 శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. వారి ఎంపిక ముగిశాక తగిన శిక్షణ ఇవ్వడం ఆరంభించారు.
ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్‌లో తగిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆటగాళ్లను డ్యూక్స్, ఎస్‌జీ, కూకాబుర్రా బంతులతో ఆడించారు. అక్టోబర్‌లో జరిగిన అండర్–19 చాలెంజర్ టోర్నీలోనూ ఈ జట్టు ఆడింది. ఇలాంటి ముందుచూపు ప్రణాళికలతో రాహుల్ ద్రవిడ్ బృందం ఆసియాకప్‌లో చాంపియన్‌గా నిలవగలిగింది. ప్రస్తుతానికి భారత క్రికెట్ జట్టు వన్టేల్లో, టెస్టుల్లో పటిష్టంగానే కనిపిస్తున్నా ఎప్పుడు అవసరమైతే అప్పుడు జట్టులో చేరేందుకు యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే పనిలో ద్రవిడ్ తీరికలేకుండా ఉండడం మన క్రికెట్‌కు మేలు చేకూర్చే అంశం. తన ఆటతో సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్‌కు వెన్నెముకలా నిలిచిన ద్రవిడ్... ఇప్పుడు తర్వాత తరాన్ని కూడా అదే రీతిలో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ సరైన దిశగా నడిపిస్తున్నారు.