ఆసియాకప్ హాకీ సెమీస్‌లో భారత్
ఇఫో (మలేసియా): వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే... కచ్చితంగా ఆసియాకప్ టైటిల్ గెలవాల్సిన స్థితిలో భారత జట్టు స్ఫూర్తిదాయకంగా ఆడుతోంది. దక్షిణ కొరియాతో సోమవారం జరిగిన పూల్ బి మ్యాచ్‌లో 2-0తో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. భారత్ తరఫున రఘునాథ్ (6వ ని.), మన్‌దీప్ సింగ్ (65వ ని.)గోల్స్ చేశారు. గోల్‌కీపర్ శ్రీజేష్ అద్భుత ప్రతిభతో భారత్ ఈ మ్యాచ్ గెలిచింది. ప్రత్యర్థి దాడులను సమర్థంగా ఎదుర్కొన్న శ్రీజేష్ కనీసం ఆరు గోల్స్ కాకుండా అడ్డుకుని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. తొలి అర్ధభాగంలో భారత్ బంతిని వీలైనంతగా తన ఆధీనంలోనే ఉంచుకుంటూ ఆడింది.
ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను డిఫెండర్ రఘునాథ్ గోల్‌గా మలచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొరియా ఎదురుదాడికి దిగి తొలి అర్ధభాగంలో ఏకంగా ఐదు పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. కానీ శ్రీజేష్ వీటిని సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలో కొరియా మరింత దూకుడుగా ఆడింది. 51వ నిమిషంలో మూక్ కాంగ్ కొట్టిన షాట్‌ను శ్రీజేష్ కళ్లుచెదిరే విధంగా డైవ్ చేసి అడ్డుకున్నాడు. ఆట చివరి పది నిమిషాల్లోనూ భారత గోల్‌కీపర్ మూడు గోల్స్ కాకుండా ఆపాడు. 65వ నిమిషంలో మన్‌దీప్ అద్భుతమైన గోల్ సాధించి భారత్‌కు 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. ఒమన్‌పై 8-0తో గెలిచిన భారత్... కొరియాపై విజయంతో సెమీస్‌కు చేరింది. బుధవారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.