పాక్ కు షాక్: ఫైనల్లో భారత్
కొలంబో:ఐసీసీ మహిళల ప్రపంచకప్ వన్డే క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన సూపర్ సిక్స్ పోరులో భారత్ విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలుత పాకిస్తాన్ 67 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆ తరువాత మూడు వికెట్లు కోల్పోయి 22.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.దాంతో ఈ మ్యాచ్ లో గెలిచి వరల్డ్ కప్ బెర్తును ఖాయం చేసుకోవాలనుకున్న పాక్ ఆశలకు గండిపడింది. పాక్ క్రీడాకారిణుల్లో అయేషా జాఫర్(19), బిస్మా మారుఫ్(13)లు మాత్రమే రెండంకెల స్కోరును నమోదు చేయగా, మిగతా జట్టంతా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. భారత బౌలర్ ఏక్తా బిస్త్ బౌలింగ్ దెబ్బకు పాక్ విలవిల్లాడింది. ఏక్తా బిస్త్ 10 ఓవర్లలో 7 మెయిడెన్ల సాయంతో 8 పరుగులివ్వడమే కాకుండా ఐదు వికెట్లను సాధించి పాక్ పతనాన్ని శాసించింది. ఎక్స్ట్రా రూపంలో వచ్చిన 24 పరుగులకే పాక్ స్కోరు బోర్డులో అత్యధికం కావడం ఇక్కడ విశేషం.
ఆ తరువాత 68 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించి భారత మహిళలు ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకున్నారు.ఓపెనర్ మెష్రామ్(9) ఆదిలో పెవిలియన్ చేరినప్పటికీ, దీప్తి శర్మ(29 నాటౌట్), హర్మన్ ప్రీత్ కౌర్(24)లు రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ఇది సూపర్ సిక్స్ దశలో భారత్ కు మూడో విజయం కాగా, అంతకుముందు లీగ్ దశలో నాలుగు విజయాల్ని సాధించింది. తద్వారా ఈ టోర్నీలో భారత్ వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. మరొకవైపు సూపర్ సిక్స్ దశలో అగ్రస్థానంలో నిలిచిన భారత్ తుది పోరుకు అర్హత సాధించింది.ఈ నెల 21వ తేదీన ఫైనల్ జరుగునుంది.