వరల్డ్ కప్ నుంచి భారత మహిళలు అవుట్!
ధర్మశాల:టీ 20 మహిళల ప్రపంచకప్లో వరుసగా రెండో ఓటమిని చవిచూసిన భారత జట్టు టోర్నీ నుంచి దాదాపు నిష్ర్కమించేందుకు సిద్ధమైంది. గ్రూప్-బిలో భాగంగా మంగళవారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత రెండు వికెట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో వరల్డ్ కప్ లో సెమీస్ ఆశలను క్లిష్టం చేసుకుంది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత భారత్ ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 90 పరుగులకే పరిమితమైంది. భారత క్రీడాకారిణుల్లో కెప్టెన్ మిథాలీ రాజ్(20), హర్మన్ ప్రీత్ కౌర్(26)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో హీథర్ నైట్ మూడు వికెట్లు సాధించగా, ష్రుబ్ సోల్ కు రెండు,స్కైవర్ కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం 91 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించి ఇంగ్లండ్ 19.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టులో బియోమౌంట్(20), సారాహ్ టేలర్(16), స్కైవర్(19)లతో పాటు, మిగతా క్రీడాకారిణులు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ ఇంకా ఓవర్ మిగిలి ఉండగా విజయం సాధించింది. ఇప్పటివరకూ భారత మహిళలు మూడు మ్యాచ్లు ఆడగా రెండింట ఓటమి చెందారు. అంతకుముందు పాకిస్తాన్ పై కూడా భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే.కాగా, భారత గ్రూప్ లో ఉన్న ఇంగ్లండ్, వెస్టిండీస్ లు రెండేసి విజయాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంకా భారత్ కు వెస్టిండీస్ తో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండటంతో సెమీస్ కు చేరడం కష్టమే. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప భారత్ పోరు దాదాపు ముగిసినట్టే