
భారత మహిళలకు మరో ఓటమి
మూడో వన్డేలో కివీస్ విజయం
బెంగళూరు : భారత మహిళల క్రికెట్ జట్టుకు వరుసగా రెండో పరాజయం. వేద కృష్ణమూర్తి (85 బంతుల్లో 61; 6 ఫోర్లు), మిథాలీ రాజ్ (70 బంతుల్లో 30; 5 ఫోర్లు) మినహా మరో బ్యాట్స్‌వుమన్ రాణించకపోవడంతో శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో కివీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆరున ఇదే వేదికపై నాలుగో వన్డే జరుగుతుంది.
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేన 50 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. వేద, దీప్తి (22) ఐదో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డెవిన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన కివీస్ 45.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 186 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు రాచెల్ ప్రీస్ట్ (101 బంతుల్లో 64; 7 ఫోర్లు; 1 సిక్స్), సుజీ బేట్స్ (87 బంతుల్లో 59; 7 ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు.