న్యూఢిల్లీ: గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా కొత్త సీజన్‌ను స్వర్ణ పతకంతో ప్రారంభించాడు. బల్గేరియాలో ఆదివారం ముగిసిన డాన్ కొలోవ్–నికోలా పెట్రోవ్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో బజరంగ్ విజేతగా నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ 12–3 పాయింట్ల తేడాతో జోర్డాన్ మైకేల్ ఒలివర్ (అమెరికా)పై ఘనవిజయం సాధించాడు. ఈ విజయంతో బజరంగ్‌కు 25 పాయింట్లు లభించాయి. ఈ టోర్నీలో మొత్తం బజరంగ్ 35 పాయింట్లు స్కోరు చేసి, తన ప్రత్యర్థులకు 15 పాయింట్లు సమర్పించుకున్నాడు.
హరియాణకు చెందిన బజరంగ్ తొలి రౌండ్‌లో 13–6తో లులియాన్ జెర్జెనోవ్ (రష్యా)పై... క్వార్టర్ ఫైనల్లో 2–0తో ఎడ్వర్డ్ గ్రిగోరెవ్ (రష్యా)పై... సెమీఫైనల్లో 8–6తో నిర్హున్ స్కారాబిన్ (బెలారస్)పై గెలుపొందాడు. ‘ఈ స్వర్ణ పతకాన్ని వింగ్ కమాండర్ అభినందన్‌కు అంకితం ఇస్తున్నాను. అతను తన ధీరత్వంతో నాలో స్ఫూర్తి నింపాడు. సాధ్యమైనంత త్వరలో అభినందన్‌ను కలిసి అతనితో కరచాలనం చేయాలనుకుంటున్నాను’ అని బజరంగ్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది కాలంలో బజరంగ్ ఖాతాలో చేరిన ఏడో అంతర్జాతీయ పతకమిది. గత సంవత్సర కాలంలో బజరంగ్ ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం... కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం...జార్జియా గ్రాండ్‌ప్రి టోర్నీలో స్వర్ణం... యాసర్ డొగు టోర్నీలో స్వర్ణం... ఆసియా క్రీడల్లో స్వర్ణం... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించాడు.
వినేశ్‌కు నిరాశ...
మహిళల 53 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ వినేశ్ ఫొగాట్ రజత పతకంతో సరిపెట్టుకుంది. కియాన్‌యు పాంగ్ (చైనా)తో జరిగిన ఫైనల్లో వినేశ్ 2–9 పాయింట్ల తేడాతో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. తొలి రౌండ్‌లో వినేశ్ 10–0తో కెనిమయేవా (ఉజ్బెకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–4తో ఆమీ ఫియర్‌ఇన్‌సైడ్ (అమెరికా)పై, సెమీఫైనల్లో 4–2తో సారా యాన్ హిల్‌డెబ్రాన్‌ంట్ (అమెరికా)పై గెలుపొందింది. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు లభించాయి. బజరంగ్‌తోపాటు పూజా ధండా (మహిళల 59 కేజీలు) స్వర్ణం నెగ్గగా... వినేశ్ (53 కేజీలు), సరిత మోర్ (59 కేజీలు), సాక్షి మలిక్ (65 కేజీలు), సందీప్ తోమర్ (పురుషుల 61 కేజీలు) రజత పతకాలు గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment