కుర్రాళ్లకు మంచి చాన్స్ | Indian Youngsters Look to Shine on Short Bangladesh Tour | Sakshi
Sakshi News home page

కుర్రాళ్లకు మంచి చాన్స్

Published Sun, Jun 15 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

కుర్రాళ్లకు మంచి చాన్స్

కుర్రాళ్లకు మంచి చాన్స్

మ. గం. 12.30 నుంచి
 స్టార్‌స్పోర్ట్స్ -1లో ప్రత్యక్ష ప్రసారం
 
 బంగ్లాదేశ్- భారత్ తొలి వన్డే నేడు
 మిర్పూర్: భారత యువ క్రికెటర్లకు సువర్ణావకాశం. తమ సత్తా చాటుకునేందుకు అపురూపమైన అవకాశం. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో... రైనా సారథ్యంలో పలువురు యువ క్రికెటర్లు సత్తా చూపాలని తహతహలాడుతున్నారు. భారత్ ద్వితీయ శ్రేణి జట్టును పంపిందంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ చేసిన వ్యాఖ్యకు సరైన సమాధానంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని రైనా అండ్ కో ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ ఆదివారం షేరే బంగ్లా స్టేడియంలో జరగనుంది.
 
 ఉతప్ప, పుజారాలకు పరీక్ష
  పలువురు భారత ఆటగాళ్ల సామర్థ్యానికి ఈ సిరీస్ ఓ పరీక్ష. ప్రత్యేకించి ఐపీఎల్-7లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఉతప్ప పైనే అందరి దృష్టి ఉంది. ఆరేళ్ల విరామం తరువాత తిరిగి జట్టులోకొచ్చినఉతప్ప భవిష్యత్తు ఈ సిరీస్‌పైనే ఆధారపడి ఉంది. ఇక టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిన చతేశ్వర్ పుజారాకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌కు జట్టులో ఉండాలంటే 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ రాణించగలనని నిరూపించుకోవాల్సిన పరిస్థితి అతనిది. ఇక తొలి వన్డేకు తుదిజట్టులో మనోజ్ తివారి, అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లలో ఇద్దరికే అవకాశం దక్కవచ్చు.

 
పేస్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మలకు స్థానం ఖాయంగా కనిపిస్తుండగా.. స్పిన్నర్లలో అమిత్ మిశ్రాకు తోడుగా పర్వేజ్ రసూల్, అక్షర్ పటేల్‌లలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. మరోవైపు టి20 ప్రపంచకప్‌లో సొంతగడ్డపై లీగ్ దశలోనే నిష్ర్కమించిన బంగ్లాదేశ్.. ఆ పరాజయ భారం నుంచి బయటపడేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే కెప్టెన్ ముష్ఫికర్, ఆల్‌రౌండర్ షకీబ్, ఓపెనర్ తమీమ్‌లపైనే జట్టు ఎక్కువగా ఆధారపడింది.
 
 జట్లు (అంచనా): భారత్: రైనా (కెప్టెన్), ఉతప్ప, రహానే, పుజారా, మనోజ్ తివారి, రాయుడు/కేదార్ జాదవ్, సాహా, ఉమేశ్, మోహిత్, మిశ్రా, రసూల్/అక్షర్ పటేల్.
 
 బంగ్లాదేశ్: ముష్ఫికర్ (కెప్టెన్), తమీమ్, అనాముల్, మోమినుల్, షకీబ్, నాసిర్ హొస్సేన్, మహ్మదుల్లా, రజాక్, గజీ, మోర్తజా, అమిన్ హొస్సేన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement