టి20ల్లో రైనా ప్రమాదకారి
గంగూలీ అభిప్రాయం
మిర్పూర్: టి20ల్లో సురేశ్ రైనా ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ అని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. షార్ట్ ఫార్మాట్‌లో అతని సత్తాను శంకించాల్సిన పనిలేదన్నాడు. ప్రస్తుత టి20 ప్రపంచకప్ ఫామ్ రాబోయే పెద్ద టోర్నీలో స్ఫూర్తిగా పనికొస్తుందని చెప్పాడు. ‘రైనా నైపుణ్యం, సామర్థ్యంపై నాకు ఎలాంటి అపనమ్మకం లేదు. పొట్టి ఫార్మాట్‌లో అతను అద్భుతమైన ప్లేయర్.
ప్రత్యర్థి ఎవరైనా టి20ల్లో అతను ప్రమాదరకరమైన ఆటగాడు. వచ్చే ఇంగ్లండ్, ఆసీస్ పర్యటనలు అతని సత్తాకు సవాలుగా నిలవనున్నాయి. అయితే ఈ రెండింటిలో రైనా విజయవంతమవుతాడని ఆశిస్తున్నా’ అని దాదా పేర్కొన్నాడు. ఇటీవల కలిసినప్పుడు కొన్ని వ్యక్తిగత అంశాలను రైనాతో చర్చించానన్నాడు. రైనాతో పాటు ఎవరైనా తన సలహాలు కావాలనుకుంటే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు.
స్వీయ నమ్మకం ఉండాలి!
ఇటీవల ఫామ్ కోల్పోయి బాధపడుతున్న యువరాజ్ సింగ్ గురించి దాదా మాట్లాడుతూ... ‘రెండు మ్యాచ్‌ల్లో యువీ పరుగులు చేయలేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక బ్యాట్స్‌మన్ విజయవంతం కావాలంటే స్వీయ నమ్మకం, కష్టపడాలన్న కోరిక ఉండాలి. ఏదో ఓ దశలో తనకు వచ్చిన అవకాశాన్ని యువీ చక్కగా సద్వినియోగం చేసుకుంటాడు’ అని గంగూలీ వివరించాడు.
వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న పేసర్ షమీకి విశ్రాంతి ఇవ్వాలని వస్తున్న విమర్శలపై గంగూలీ భిన్నంగా స్పందించాడు. ‘విశ్రాంతి ఎందుకు? షమీ 24 ఏళ్ల కుర్రాడు. కేవలం 15-20 మ్యాచ్‌లు ఆడాడు. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిన సమయమిది. కాబట్టి రెస్ట్ అవసరం లేదు. కెప్టెన్ ఎప్పుడు బంతి ఇస్తే అప్పుడు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండటం అతని కర్తవ్యం’ అని గంగూలీ అన్నాడు.