
క్రైస్ట్‌చర్చ్: యువ కెరటాల క్రికెట్ పండుగకు నేడు తెరలేవనుంది. 22 రోజుల పాటు సాగనున్న అండర్–19 క్రికెట్ ప్రపంచకప్ తొలి రోజున అఫ్ఘానిస్తాన్‌తో పాకిస్తాన్; పపువా న్యూ గినియాతో జింబాబ్వే; బంగ్లాదేశ్‌తో నమీబియా; ఆతిథ్య న్యూజిలాండ్‌తో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ తలపడతాయి. ఈ టోర్నీలో భారత్ ఆదివారం ఆస్ట్రేలియాతో మౌంట్ మాంగనీలో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే మూడుసార్లు ట్రోఫీని ముద్దాడి గత టోర్నీలో చివరి మెట్టుపై బోల్తా కొట్టిన యువ భారత జట్టు ఈసారి ఎలాగైనా కప్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండటం భారత్‌కు సానుకూలాంశం.
దేశవాళీల్లో చెలరేగుతున్న పృథ్వీ షా నిలకడగా రాణిస్తే... మన జట్టుకు ఎదురుండదు. అతనితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా సత్తాచాటి జాతీయ సీనియర్ జట్టుకు ఆడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ... ‘మా రోజుల్లో ఈ టోర్నీ లేదు. 1988 తర్వాత పదేళ్ల పాటు అండర్–19 వరల్డ్‌కప్ నిర్వహించలేదు. అందుకే మాకు ఇందులో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఇది కుర్రాళ్లకు చక్కటి అవకాశం’ అని తెలిపాడు.