భారత్‌కు ఓపిక అవసరం | India's patience is required | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఓపిక అవసరం

Published Sat, Aug 22 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

India's patience is required

అనిల్ కుంబ్లే
 రెండో రోజు ఆట ముగిసేసరికి ఈ టెస్టు ఆసక్తికరంగా మారింది. నువ్వా.. నేనా అనే రీతిలో సాగినా మూడో రోజు భారత్‌కు కాస్త ఆధిక్యం దొరికేటట్లే కనిపిస్తోంది. నేటి (శనివారం) ఆట ఆరంభంలోనే వికెట్లు తీయడం చాలా కీలకం. పిచ్ ఇప్పటిదాకా అయితే బౌలర్లకు సహాయకారిగానే ఉంటోంది. మ్యాచ్ ఎలా సాగబోయేది తొలి సెషన్ నిర్ధారిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యం మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ జారవిడుచుకునే అవకాశం ఇవ్వకూడదు. ఏ టెస్టులోనైనా రెండు, మూడో రోజు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భారత్ చాలా ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం.. శ్రీలంక చివరి వరుస దాకా బ్యాటింగ్ చేసే జట్టు అని గుర్తుంచుకోవాలి.

 భారత్ విషయంలో రాహుల్, కోహ్లి మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడినా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసే అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంది. ముఖ్యంగా రాహుల్ బ్యాటింగ్ చేసిన విధానం.. అతడి ఫుట్‌వర్క్ చూడముచ్చటగా ఉంది. స్పిన్నర్లను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఇక బౌలింగ్‌లో మన జట్టు మెరిసింది. ఇదే జోరును చూపితేనే ఫలితం ఉంటుంది. బౌలర్లు ఉమేశ్ యాదవ్, స్పిన్నర్ అశ్విన్ ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా సంగక్కరను వరుసగా మూడోసారి కూడా అశ్విన్ అవుట్ చేయగలిగాడు. నిజానికి లంక చక్కటి ఆధిక్యం కోసం చూస్తోంది. ఈ సమయంలోనూ భారత్ సానుకూల ధృక్పథంతోనే ఉండాలి. 1-0తో ఆధిక్యంలో ఉన్న లంక ఆటగాళ్లు తమ సహజశైలిలోనే ఆడేందుకు చూస్తున్నారు. కానీ కోహ్లి బృందం మాత్రం మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుని సిరీస్‌ను సమం చేయడంపై దృష్టి పెట్టాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement