
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
79 ఏళ్ల తర్వాత డేవిస్ కప్ నెగ్గిన బ్రిటన్
ఫైనల్లో బెల్జియంపై 3-1తో గెలుపు
ఆండీ ముర్రే అద్భుత ప్రదర్శన
గెంట్ (బెల్జియం): దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ఊరిస్తున్న ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఈవెంట్ డేవిస్ కప్‌ను బ్రిటన్ జట్టు ఈసారి చేజిక్కించుకుంది. బెల్జియం జట్టుతో జరిగిన ఫైనల్లో బ్రిటన్ 3-1తో విజయం సాధించింది. ఆదివారం జరిగిన రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండీ ముర్రే 6-3, 7-5, 6-3తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలుపొందడంతో బ్రిటన్ విజయం ఖాయమైంది. ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. 79 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బ్రిటన్‌కు టైటిల్ దక్కడంలో ఆండీ ముర్రే కీలకపాత్ర పోషించాడు. తొలి రోజు సింగిల్స్‌లో నెగ్గడంతోపాటు రెండో రోజు తన సోదరుడు జేమీ ముర్రేతో కలిసి డబుల్స్ మ్యాచ్‌లో విజయాన్ని అందించాడు. చివరిసారి 1936లో డేవిస్ కప్ టైటిల్‌ను సాధించిన బ్రిటన్... 1978లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ 1-4తో అమెరికా చేతిలో ఓడింది.