చెన్నై: ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర పోరు. చెరో 8 పాయింట్లతో పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. రెండు జట్లూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలు నమోదు చేశాయి. బలాబలాల్లో ఇరు జట్లూ సమంగానే కనిపిస్తున్నప్పటికీ ఒంటిచేత్తే కేకేఆర్‌కు విజయాలు సాధించిపెడుతున్న ఆల్‌రౌండర్, హార్డ్ హిట్టర్ రసెల్‌పైనే అందరి దృష్టి నెలకొని ఉంది.
పై చేయి ఏ స్పిన్ త్రయందో..
ప్రస్తుత ఐపీఎల్‌లో నాణ్యమైన స్పిన్ విభాగం కేకేఆర్, సీఎస్‌కే సొంతం. కోల్‌కతా తరఫున కుల్‌దీప్ యాదవ్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లా ప్రత్యర్థి ఆటగాళ్లకు ముకుతాడు వేస్తుండగా, చెన్నై తరఫున ఆ బాధ్యతను వెటరన్ హర్భజన్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా సమర్థంగా నెరవేరుస్తున్నారు. మ్యాచ్ జరగనున్న చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. ఈ క్రమంలో రెండు జట్లూ తమ స్పిన్ త్రయాలతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏ జట్టు స్పిన్ త్రయానిది పై చేయి కానుందో చూడాలి. కాగా, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆ తర్వాత ముంబై చేతిలో ఓడినప్పటికీ శనివారం కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ విజయాల బాట పట్టింది.
మరోవైపు గంభీర్ దూరమైనప్పటికీ కొత్త కెప్టెన్ దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కేకేఆర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ అటు బంతితోనూ ఇటు బ్యాట్‌తోనూ చెలరేగిపోతున్నాడు. విధ్వంసక ఆటతో ఇప్పటికే జట్టును మూడు మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో గెలిపించాడు. దీంతో నేడు జరగబోయే మ్యాచ్‌లో రస్సెల్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. అతన్ని అడ్డుకోవడానికి ధోని ఏ వ్యూహాలు రచిస్తాడో వేచి చూడాల్సిందే. ఇక చెన్నై జట్టుకు మరో విండీస్ ఆల్‌రౌండర్ బ్రేవో దూరమైనప్పటికీ అతని స్థానంలో జట్టులోకి వచ్చిన డుప్లెసిస్ తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ధోని సైతం ఫామ్‌లోనే ఉండడంతో కోల్‌కతాకు ఈ మ్యాచ్ అంత సులభం కాకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment