సన్‌రైజర్స్‌ చిత్తు చిత్తుగా.. | IPL 2019 Delhi Capitals Won By 39 Runs Against Sunrisers | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ది మళ్లీ అదే కథ..

Published Mon, Apr 15 2019 12:05 AM | Last Updated on Mon, Apr 15 2019 12:20 AM

IPL 2019 Delhi Capitals Won By 39 Runs Against Sunrisers - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించాలంటే 30 బంతుల్లో 56 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. అరవీర భయంకర డేవిడ్‌ వార్నర్‌ క్రీజులో ఉన్నాడు. దీంతో సన్‌రైజర్స్‌ విజయం ఖాయం అనుకున్నారు. కానీ తీరా ఫలితం చూస్తే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయింది. 17 పరుగుల వ్యవధిలో చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయి.. సన్‌రైజర్స్‌ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఓపెనర్లు మినహా ఎవరూ రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. మరోసారి మిడిలార్డర్‌ ఢమాల్‌ అవడంతో ఆరెంజ్‌ ఆర్మీకి హ్యాట్రిక్‌ ఓటమి తప్పలేదు.  

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 39 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో సన్‌రైజర్స్‌ ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి నమోదైంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌ కావడం అందులోనూ రెగ్యులర్‌ సారథి విలియమ్సన్‌ తిరిగి రావడంతో ఢిల్లీపై విజయం ఖాయమనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లు రబడ(4/22), మోరిస్‌(3/22), కీమో పాల్‌(3/17) సన్‌రైజర్స్‌ పతనాన్ని శాసించారు.
ఛేదనలో ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(51), బెయిర్‌ స్టో(41)లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. బెయిర్‌ స్టో నిష్క్రమించిన అనంతరం సన్‌రైజర్స్‌ పతనం ప్రారంభమైంది. విలియమ్సన్‌(3)తో మెదలెడితే మిగతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి రికీ భుయ్‌(7), శంకర్‌(1), హుడా(3), అభిషేక్‌(3), రషీద్‌(0)లు నిలవలేక చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్‌కు ఘోర ఓటమి తప్పలేదు. 

అంతకముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. పృథ్వీ షా(4), శిఖర్‌ ధావన్‌(7) విఫలం చెందారు. ఆ తర్వాత కొలిన్‌ మున్రో(40: 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడగా, శ్రేయస్‌ అయ్యర్‌(45; 40 బంతుల్లో 5 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు.

ఆపై రిషభ్‌ పంత్‌(23), అక్షర్‌ పటేల్‌(14)లు రెండంకెల స్కోరుకే పరిమితం కావడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ రెండు వికెట్లు తీశాడు. అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement