ఐపీఎల్ చరిత్రలో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఏబీ డివిలియర్స్ 15 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇన్ని సందర్భాల్లో ఒక్కసారి కూడా అతని జట్టు ఓడిపోలేదు. కానీ గురువారం ముంబైతో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి బెంగళూరును విజయానికి చేరువగా తెచ్చినా గెలుపు దక్కలేదు. చివరి 5 బంతుల్లో 11 పరుగులు చేస్తే గెలవాల్సిన స్థితిలో... తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ మలింగ 4 పరుగులే ఇచ్చి ముంబైని గట్టెక్కించాడు. అయితే ఆఖరి బంతి ‘నోబాల్’ కాగా... అంపైర్లు గుర్తించడంలో పొరపాటు చేశారు. మ్యాచ్ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది.
బెంగళూరు: ఐపీఎల్ తాజా సీజన్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రాత మారలేదు. చిన్నస్వామి స్టేడియంలో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (33 బంతుల్లో 48; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... యువరాజ్ సింగ్ (12 బంతుల్లో 23; 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 32 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ఏబీ డివిలియర్స్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (32 బంతుల్లో 46; 6 ఫోర్లు) ఆకట్టుకున్నాడు.
రోహిత్ దూకుడు...
ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ వేసిన ఇన్నింగ్స్ తొలిరెండు ఓవర్లలో నాలుగు బౌండరీలు బాదిరోహిత్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. మరో బంతిని సిక్సర్‌గా మలిచి ప్రేక్షకుల్లో జోష్ పెంచాడు. అనంతరం మరో రెండు బౌండరీలు బాదిన రోహిత్... ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
యువీ హ్యాట్రిక్ సిక్సర్ల జోరు
యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. కేవలం 12 బంతులే ఆడిన యువీ... తొలి 8 బంతుల్లో కేవలం 5 పరుగులే చేశాడు. తర్వాతి మూడు బంతుల్ని భారీ సిక్సర్లుగా మలిచాడు. చహల్ వేసిన తొలి బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా, బౌలర్ తల మీదుగా రెండో సిక్స్ కొట్టిన తీరు అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. వెంటనే లాంగాన్ మీదుగా మరో సిక్సర్ బాది అసలైన ఐపీఎల్ మజాను ప్రేక్షకులకు పంచాడు. అనంతరం చహల్ వేసిన గుగ్లీకి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చాడు.
హార్దిక్ విధ్వంసం
16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 145/5. ఈ దశలో హార్దిక్ పాండ్యా ధాటిని ప్రదర్శించాడు. సైనీ వేసిన 19వ ఓవర్లో 6, 4 సహాయంతో హార్దిక్ 15 పరుగులు రాబట్టాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మరో రెండు సిక్సర్లతో మరో 15 పరుగులు పిండుకున్నాడు. దీంతో ముంబై మంచి లక్ష్యాన్ని బెంగళూరుకు నిర్దేశించగలిగింది.
శుభారంభం దక్కినా...
లక్ష్యఛేదనను బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. ఓపెనర్లు పార్థివ్ పటేల్ (31; 4 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (13) ఆచితూచి ఆడారు. కోహ్లి రాకతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
బతికిపోయిన డివిలియర్స్
తాను ఎదుర్కొన్న తొలి బంతికే స్లిప్‌లో యువరాజ్ క్యాచ్ వదిలేయడంతో డివిలియర్స్ ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. 11, 12 ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదిన ఏబీ... 15వ ఓవర్లో మరో రెండు ఫోర్లతో జోరు కనబరిచాడు. పేసర్ మలింగ వేసిన 16వ ఓవర్‌లో ఏబీ మరింతగా రెచ్చిపోయాడు. 4, 1, 6, 6తో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ఒత్తిడిలోనూ స్వేచ్ఛగా ఆడిన డివిలియర్స్... హార్దిక్ బౌలింగ్‌లో 4, 6, 6తో 18 పరుగులు రాబట్టాడు. ఈ స్థితిలో బుమ్రా మరోసారి తన స్థాయిని ప్రదర్శిస్తూ... గ్రాండ్‌హోమ్ (2) వికెట్ తీయడంతో పాటు 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
బుమ్రా వర్సెస్ కోహ్లి
ముఖాముఖి మ్యాచ్‌లో తొలుత కోహ్లి జోరు ముందు బుమ్రా తేలిపోయినా... చివరకు తన కెప్టెన్‌ను ఔట్ చేసి బుమ్రా తన మాటను నెగ్గించుకున్నాడు. క్రీజులోకి వస్తూనే బుమ్రా బౌలింగ్‌లో వరుసగా మూడు బంతుల్లో కోహ్లి 3 ఫోర్లు బాది ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే బుమ్రా వేసిన షార్ట్ బంతిని ఆడబోయి మిడ్‌వికెట్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
►‘మేం ఐపీఎల్ ఆడుతున్నాం. క్లబ్ స్థాయి క్రికెట్ కాదు. ఆఖరి బంతిని నోబాల్‌గా ప్రకటించకపోవటం దుర్మార్గం. ఏకంగా అంగుళం తేడాతో అడుగు పడింది. అంపైర్లు కళ్లు మూసుకున్నారా! ఇలాంటి చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్లు మరింత జాగ్రత్తగా, చురుగ్గా ఉండాల్సింది’
– కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment