ఒక్క పరుగు... ఒక్క పరుగు... ముంబై ఇండియన్స్ ఇకపై ఉచ్ఛరించే మంత్రమిది... రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే వేదికపై ఐపీఎల్ ఫైనల్లో స్వల్ప స్కోరును నమోదు చేసి ఒక్క పరుగుతో చాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేన ఇప్పుడు మళ్లీ అదే అద్భుతాన్ని చేసి చూపించింది. బ్యాటింగ్ వైఫల్యంతో 149 పరుగులకే పరిమితమై... చెత్త ఫీల్డింగ్, క్యాచ్‌లు, రనౌట్‌లు వదిలేసి కూడా చివరకు చిరకాల ప్రత్యర్థి చెన్నైపై పైచేయి సాధించగలిగింది.
చార్మినార్ కోటలో ‘చార్ మార్’ చేస్తూ నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అనూహ్య పరిణామాలతో, మలుపులతో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన తుది పోరులో ముంబై విజయజెండా ఎగరవేసింది. మ్యాచ్‌లో ఎక్కువ భాగం పట్టు కొనసాగించిన ధోని వ్యూహానికే ఇక టైటిల్ ఖాయమనిపించగా... రోహిత్ చివరి ఓవర్ ప్లాన్ అద్భుతంగా పని చేసింది.
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ తమ అద్భుత రికార్డును కొనసాగించింది. మూడో సారి కూడా ధోని సేనను చిత్తు చేసి ఐపీఎల్ –2019 విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డి కాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు.
వాట్సన్ మినహా...
సింగిల్ తీయడంలో తడబాటు... త్రుటిలో తప్పించుకున్న రనౌట్... ఇలా చెన్నై తొలి మూడు ఓవర్ల ఇన్నింగ్స్ గందరగోళంగా సాగింది. ఆ తర్వాత కృనాల్ వేసిన నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 బాదిన డు ప్లెసిస్ (13 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత మలింగ ఓవర్లో వాట్సన్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ ఇచ్చిన క్యాచ్‌ను మలింగ వదిలేయడంతో చెన్నైకి లైఫ్ లభించింది.
అతి కష్టమ్మీద పరుగులు తీస్తూ, అప్పటికే అంపైర్ రివ్యూలో ఒకసారి బతికిపోయిన రైనా (8) ఈసారి నిలవలేకపోయాడు. రాహుల్ చహర్ బౌలింగ్‌లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు. ఇప్పుడు రివ్యూ కోరినా ఫలితం దక్కలేదు. రాయుడు (1) తన వైఫల్యం కొనసాగిస్తూ బుమ్రా బౌన్సర్‌కు ఔటయ్యాడు. వరుసగా వికెట్లు పోతుండగా, మరో ఎండ్‌లో నిలిచిన వాట్సన్‌లో కూడా జోరు తగ్గింది. మళ్లీ జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత ధోని (2) పైనే పడింది. అయితే అతను అనూహ్యంగా రనౌట్ అయిన్పటికీ, ఆ తర్వాత వాట్సన్ జోరుతో చెన్నై గెలుపునకు చేరువగా రాగలిగింది.
ధోని రనౌట్‌తో...
ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధోని కీలక సమయంలో రనౌట్ కావడం చెన్నై శిబిరాన్ని ఒక్కసారిగా ఆందోళనలో పడేసింది. హార్దిక్ బౌలింగ్‌లో వాట్సన్ ఫైన్‌లెగ్ వైపు ఆడగా సింగిల్ వచ్చింది. బంతిని ఆపి మలింగ విసిరిన త్రో నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కు దూరంగా వెళుతుండటంతో ధోని రెండో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా దూసుకొచ్చిన ఇషాన్ కిషన్ నేరుగా వికెట్లపైకి కొట్టాడు. బంతి స్టంప్స్‌కు తగిలే సమయంలో బ్యాట్ క్రీజ్ గీతపైనే ఉంది. నిజానికి ధోని తనే ఔట్‌గా భావించి ముందే నడవటం మొదలు పెట్టినా ఫీల్డ్ అంపైర్లు అతడిని ఆపారు. సుదీర్ఘ సమయం పాటు పదే పదే రీప్లేలు చూసిన అనంతరం చివరకు అంపైర్ నైజేల్ లాంజ్ ధోనిని ఔట్‌గా ప్రకటించాడు. ఈ వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు.
చివరి 5 ఓవర్లలో...
ధోని వికెట్ పడ్డాక వాట్సన్‌తో పాటు పెద్దగా ఫామ్‌లో లేని బ్రేవో క్రీజ్‌లో ఉన్నాడు. 30 బంతుల్లో 62 పరుగులు చేయాల్సిన స్థితి చెన్నైకి కష్టంగానే కనిపిస్తోంది. అయితే 16వ ఓవర్లో మళ్లీ ఆట మారిపోయింది. మలింగ వేసిన ఈ ఓవర్లో బ్రేవో సిక్స్ బాదగా, వాట్సన్ 3 ఫోర్లు కొట్టాడు. దాంతో 20 పరుగులు వచ్చాయి. అప్పటి వరకు అద్భుత బౌలింగ్‌తో ప్రశంసలు అందుకున్న రాహుల్ చహర్... బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో వాట్సన్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థికి మరో అవకాశం కల్పించాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 6, 6 బాది వాట్సన్ చెలరేగిపోయాడు. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ చెన్నై వైపు తిరిగింది. బ్రేవో (15) ఔటైనా, వాట్సన్ గెలిపించే స్థితిలో నిలిచాడు. అయితే చివరకు అదృష్టం సూపర్ కింగ్స్ మొహం చాటేసింది.
రోహిత్ విఫలం...
ఆరంభంలో డి కాక్, ఆ తర్వాత పొలార్డ్ మినహా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో జోష్ కనిపించలేదు. జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 9 ఫోర్లే ఉన్నాయి. ఇన్నింగ్స్ తొలి రెండు ఓవర్లలో ఒక సిక్సర్ సహా ముంబై పది పరుగులే చేసింది. అనంతరం డి కాక్ దూకుడైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. దీపక్ చహర్ వేసిన మూడో ఓవర్లో డి కాక్ మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత శార్దుల్ బౌలింగ్‌లోనూ అతను మరో సిక్స్ బాదాడు.
అయితే తర్వాతి బంతికే డి కాక్‌ను ఔట్ చేసి శార్దుల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. పవర్‌ప్లే చివరి ఓవర్ చెన్నైకి మరింతగా కలిసొచ్చింది. అంతకుముందు ఓవర్లో భారీగా పరుగులిచ్చినా దీపక్ చహర్‌తో మళ్లీ బౌలింగ్ వేయించిన ధోని వ్యూహం పని చేసింది. చక్కటి బంతిని డ్రైవ్ చేయబోయి కెప్టెన్ రోహిత్ శర్మ (14 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఓవర్ మెయిడిన్‌గా కూడా ముగిసింది. క్వాలిఫయర్ హీరో సూర్య కుమార్ (17 బంతుల్లో 15; ఫోర్) తడబడుతూ ఆడగా, కృనాల్ పాండ్యా (7 బంతుల్లో 7) విఫలమయ్యాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు) కొద్దిగా నిలిచినా వేగంగా ఆడలేకపోవడంతో రన్‌రేట్ బాగా తగ్గింది.
పొలార్డ్ మెరుపులు...
ఆదివారం ఫైనల్ రోజునే పుట్టిన రోజు జరుపుకున్న పొలార్డ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గతంలో చెన్నైపై మూడు ఫైనల్స్‌లో కలిపి 60 బంతుల్లో 123 పరుగులు చేసిన రికార్డు ఉన్న అతను మరోసారి ఆకట్టుకున్నాడు. తాహిర్ వరుస ఓవర్లలో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. మరోవైపు 4 పరుగుల వద్ద రైనా క్యాచ్ వదిలేసినా హార్దిక్ (10 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) దానిని పెద్దగా వాడుకోలేకపోయాడు. దీపక్ చహర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన హార్దిక్ రివ్యూకు వెళ్లినా లాభం లేకపోయింది. బ్రేవో వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులకు రెండు ఫోర్లు కొట్టి పొలార్డ్ ఆట ముగించాడు.
పొలార్డ్ నిరసన...
ఐపీఎల్‌లో గతంలో ఒకసారి తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో నోటికి ప్లాస్టర్ వేసుకొని మైదానంలోకి దిగిన పొలార్డ్ మరోసారి తనదైన తరహాలో నిరసన తెలిపాడు. బ్రేవో వేసిన చివరి ఓవర్ మూడో బంతి క్రీజ్‌కు దూరంగా వెళుతుండటంతో అతను వైడ్‌గా భావించి వదిలేశాడు. అయితే అంపైర్ నితిన్ మీనన్ మాత్రం వైడ్ ఇవ్వలేదు. దాంతో ఆగ్రహించిన పొలార్డ్ తర్వాతి బంతికి వికెట్లకు పూర్తిగా పక్కకు జరిగి, అంతకుముందు బంతి ఎక్కడి నుంచి వెళ్లిందో దాదాపు అక్కడ (ట్రామ్‌లైన్స్) నిలబడి బ్రేవోను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. దాంతో బౌలింగ్ చేసేందుకు వచ్చిన బ్రేవో మధ్యలో విరమించుకోవాల్సి వచ్చింది. చివరకు అంపైర్ గౌల్డ్, మీనన్ కలిసి సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు.
లాంజ్‌ను పక్కన పెట్టారు...
ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లితో వాదన తర్వాత గది అద్దాలపై తన ప్రతాపం చూపించిన అంపైర్ నైజేల్ లాంజ్‌పై ఎలాంటి చర్య ఉండదని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. పైగా ఈ సీజన్‌లో భారత అంపైర్ల ప్రమాణాలు సరిగ్గా లేవని, లాంజ్ అత్యుత్తమ అంపైర్లలో ఒకడని కితాబు కూడా ఇచ్చింది. ఫైనల్‌కు నాలుగు రోజుల ముందు ప్రకటించిన ఫీల్డ్ అంపైర్ల జాబితాలో నైజేల్ లాంజ్ పేరు ఉంది. తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్‌లాంటి కీలక మ్యాచ్‌కు అలాంటి అంపైర్ అవసరం ఉందని కూడా బోర్డు ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో, లేక ఎవరినుంచైనా అభ్యంతరం వచ్చిందో తెలీదు కానీ అతడిని ఫీల్డ్ అంపైరింగ్ నుంచి పక్కన పెట్టారు. చివరకు థర్డ్ అంపైర్ స్థానానికి పరిమితం చేశారు. అతని స్థానంలో వచ్చిన నితిన్ మీనన్ బోర్డు భయపడినట్లు పేలవ అంపైరింగ్ చేశాడు. పొలార్డ్‌కు వైడ్ నిరాకరించడం అందులో ఒకటి.
►1 ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ విజయాల్లో పాలుపంచుకున్న ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. 2009 చాంపియన్ డెక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉండగా... 2013, 2015, 2017, 2019లలో ముంబై జట్టుకు రోహిత్ సారథ్యం వహించాడు.
►4 ముంబై జట్టు నెగ్గిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లో (2013, 2015, 2017, 2019) తొలుత బ్యాటింగ్ చేయడం విశేషం.
►4 ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందడం విశేషం. 2010లో చెన్నై 22 పరుగుల తేడాతో... 2013లో ముంబై 23 పరుగుల తేడాతో... 2015లో ముంబై 41 పరుగుల తేడాతో... 2019లో ముంబై ఒక పరుగు తేడాతో గెలిచాయి.
ఐపీఎల్ అవార్డులు
►ఆరెంజ్ క్యాప్
(అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్)
డేవిడ్ వార్నర్ (హైదరాబాద్)
692 పరుగులు
ప్రైజ్‌మనీ రూ.10లక్షలు, ట్రోఫీ
►పర్పుల్ క్యాప్
(అత్యధిక వికెట్లు తీసిన బౌలర్)
ఇమ్రాన్ తాహిర్
(చెన్నై) 26 వికెట్లు
ప్రైజ్‌మనీ రూ.10లక్షలు, ట్రోఫీ
పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు:
►పంజాబ్, హైదరాబాద్
ప్రైజ్‌మనీ: రూ. 25 లక్షలు చొప్పున
►పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్
పొలార్డ్ (ముంబై ఇండియన్స్)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ,
►సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్
ఆండ్రీ రసెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్)
ట్రోఫీ, టాటా మోటార్స్ హారియర్ ఎస్‌యువీ కారు
►స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్
లోకేశ్ రాహుల్ (పంజాబ్)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ
►డ్రీమ్–11 గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ అవార్డు
రాహుల్ చహర్ (ముంబై ఇండియన్స్)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ
►ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు
శుబ్‌మన్ గిల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
►ఫెయిర్ ప్లే అవార్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్
►మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్
ఆండ్రీ రసెల్ (కోల్‌కతా)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ
Comments
Please login to add a commentAdd a comment