జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు.
ఇప్పటివరకూ రాజస్తాన్ రాయల్స్ ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండు విజయాల్ని మాత్రమే నమోదు చేసింది. ఇక ముంబై ఇండియన్స్ నాలుగు ఆడి ఒకదాంట్లో మాత్రమే గెలుపొందింది. పాయింట్ల పట్టికలో రాజస్తాన్, ముంబై జట్లు వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంచితే, ఐపీఎల్‌లో జోఫ్రా ఆర్చర్ అరంగేట్రం చేయబోతున్నాడు. వెస్టిండీస్ క్రికెటరైన జోఫ్రా ఆర్చర్‌ను ఈ ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది. ఆర్చర్‌కు రూ. 7.20 కోట్ల రికార్డు ధర చెల్లించి రాయల్స్ కొనుగోలు చేసింది.
ఇంతకీ జోఫ్రా ఆర్చర్ ఎవరు..?
వెస్టిండీస్ అండర్-19 క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న జోఫ్రా ఆర్చర్‌ను ఒక్కసారిగా స్టార్‌ను చేసింది మాత్రం ఇంగ్లిష్ కౌంటీ చాంపియన్‌షిప్. ట్వంటీ 20 స్పెషలిస్టుగా ముద్రపడిన ఆర్చర్.. 2016లో ససెక్స్ తరపున ఆడటానికి సంతకం చేశాడు. 2017 సంవత్సరానికి సంబంధించి ఇంగ్లిస్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరపున అత్యధిక వికెట్లను సాధించి సత్తా చాటుకున్నాడు. మరొకవైపు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్య వహించిన ఆర్చర్.. తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. బీబీఎల్‌లో 10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు సాధించి తనదైన ముద్రను వేశాడు.
గంటకు 140 కి.మీపైగా వేగంతో బౌలింగ్ వేయడమే ఆర్చర్‌కు అదనపు బలం. ప్రధానంగా యార్కర్లు, బౌన్సర్లు సంధించడంలో దిట్ట. 34 ట్వంటీ 20 మ్యాచ్‌ల్లో 40కి పైగా వికెట్లు సాధించాడు. మరొకవైపు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లో చేసే అతని టీ 20 స్టైక్‌రేట్ 145. 45 గా ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఈ 22 ఏళ్ల బార్బోడాస్ క్రికెటర్‌కు భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది. అయితే ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న జోఫ్రా ఆర్చర్ ఎంత వరకూ రాణిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment