తొలుత యూఏఈలో.. తర్వాత భారత్‌లో..
ఐపీఎల్-7 షెడ్యూల్‌ను ఖరారు చేసిన బీసీసీఐ
ప్రత్యామ్నాయ వేదికగా బంగ్లాదేశ్
ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు ఐపీఎల్-7
47 రోజుల్లో 60 మ్యాచ్‌లు
మ్యాచ్‌ల తేదీలను శుక్రవారం ప్రకటించనున్న బీసీసీఐ
తొలి విడత ఏప్రిల్ 16-30 (దుబాయ్‌లో)
రెండో విడత మే 1-12 (భారత్‌లో లేదా బంగ్లాదేశ్‌లో)
మూడో విడత మే 13-జూన్ 1 (భారత్‌లో)
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్ వేదికపై సస్పెన్స్ వీడింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని కేంద్ర హోం శాఖ తేల్చి చెప్పడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రత్యామ్నాయ వేదికలను ఎంపిక చేసింది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు జరిగే ఐపీఎల్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరిగే తొలి విడతలో కనీసం 16 మ్యాచ్‌లు యూఏఈలోజరుగుతాయి. ఈ టి20 మ్యాచ్‌లను అబుదాబి, దుబాయ్, షార్జాలలో నిర్వహిస్తారు.
మే 1 నుంచి 12 వరకు రెండో విడత మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లోనే రెండో విడత మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఈ మ్యాచ్‌లకు హోంశాఖ నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఒకవేళ అనుమతి రాకపోతే రెండో విడత మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లో నిర్వహిస్తారు. దీనికి బంగ్లా ప్రభుత్వం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఆమోదం తెలిపాయి.
ఫైనల్ లెగ్ భారత్‌లోనే...
రెండో విడత మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహించినా... మే 13 నుంచి జూన్ 1 వరకు జరిగే చివరి విడత (ఫైనల్ లెగ్) మ్యాచ్‌లను మాత్రం భారత్‌లోనే నిర్వహిస్తారు. అప్పటికే అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మిగిలిన కొన్ని లీగ్‌లతో పాటు ప్లే ఆఫ్‌లు, ఫైనల్‌ను భారత్‌లోనే నిర్వహిస్తారు.
మే 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌తో పాటు నాలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్‌తో సహా) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా జరగనుంది. చివరి విడత పోలింగ్ నుంచి కౌంటింగ్ తేదీ వరకు మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై బీసీసీఐ పెద్దలు హోంశాఖ అధికారుల సలహా కోరనున్నారు. ఇక బీసీసీఐ, ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ మ్యాచ్‌ల తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. శుక్రవారం మ్యాచ్‌ల తేదీలను వెల్లడిస్తామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు.
విదేశాల్లో రెండోసారి...
ఐపీఎల్ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించడం ఇది రెండోసారి. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండో సీజన్‌ను పూర్తిగా దక్షిణాఫ్రికాలోనే నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఎన్నికల షెడ్యూల్(ఏప్రిల్ 7 నుంచి మే 12)ను దృష్టిలో పెట్టుకుని తొలి విడతను విదేశాల్లో నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది.
మరోవైపు యూఏఈలో తొలి విడత మ్యాచ్‌లను నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్వాగతించింది. బీసీసీఐ నిర్ణయం యూఏఈలోని క్రికెట్ ప్రేమికులకు శుభవార్త అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ అన్నారు. ఈ టోర్నీ యూఏఈలో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానే తోడ్పడుతుందని రిచర్డ్‌సన్ ధీమా వ్యక్తం చేశారు.