న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లను అట్టి పెట్టుకునే అవకాశం ఇవ్వాలన్న ఫ్రాంచైజీల విజ్ఞప్తిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మన్నించింది. గతంలో ఈ సంఖ్య నాలుగుగా ఉండగా ఇప్పుడు దీనిని ఐదుకు పెంచారు. పైగా ‘రైట్ టు మ్యాచ్’ పేరుతో ఆరో ఆటగాడిని కూడా కొనసాగించే అవకాశాన్ని కూడా కల్పించారు. ఐపీఎల్-2014కు సంబంధించిన కొత్త నిబంధనలు, మార్పుచేర్పులను గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. ఐపీఎల్-7 కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న వేలం నిర్వహిస్తారు. అవసరమైతే దీనిని మరో రోజు పొడిగించవచ్చు. వేలం నిర్వహించే వేదికను ఇంకా ఖరారు చేయలేదు.
ఐపీఎల్-2014 ప్రధాన నిబంధనలు
ప్రతీ జట్టులో 16కు తగ్గకుండా, 27కు మించకుండా ఆటగాళ్లు ఉండాలి. ఇందులో విదేశీ ఆటగాళ్లు 9 మంది మాత్రమే.
జట్టులో ఎంచుకునే అండర్-19 స్థాయి ఆటగాళ్లు కనీసం ఫస్ట్ క్లాస్ లేదా లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
ఆటగాళ్ల కోసం ఒక ఫ్రాంచైజీ రూ. 60 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు.
2013 ఐపీఎల్ ఆడిన జట్టునుంచి ఐదుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీ విడుదల చేయకుండా తమ వద్దే కొనసాగించవచ్చు. మొదటి ఆటగాడికి రూ. 12.5 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 9.5 కోట్లు...ఇలా తగ్గిస్తూ ఐదుగురు ఆటగాళ్లకు గవర్నింగ్ కౌన్సిల్ విలువ నిర్ధారించింది.
ఇదే మొత్తాన్ని ఫ్రాంచైజీ ఫీజునుంచి (ఆటగాళ్లతో చేసుకున్న ఒప్పందంతో సంబంధం లేకుండా) తగ్గిస్తారు. ఉదాహరణకు చెన్నై జట్టు ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే కొనసాగిస్తే ఆ జట్టు మొత్తం రూ. 39 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే మిగిలిన రూ. 21 కోట్లతోనే ఆ జట్టు మిగతా 22 మంది ఆటగాళ్లను తీసుకోవాలి.
‘రైట్ టు మ్యాచ్’ అంటే....
ఫ్రాంచైజీలు ఐదుగురిని అట్టి పెట్టుకోవడంతో పాటు ఆసక్తి ఉంటే వేలం తర్వాత ఆరో ఆటగాడిని కూడా కొనసాగించే అవకాశం ఉంది. 2013 సీజన్‌లో ఒక జట్టుకు ఆడిన ఆటగాడిని వేలంలో మరో జట్టు సొంతం చేసుకుందనుకుందాం. అయితే అప్పుడు కూడా ఆ క్రికెటర్ వేలంలో అమ్ముడైన మొత్తం చెల్లించి పాత ఫ్రాంచైజీయే తీసుకోవచ్చు.
ఐదుగురిని కొనసాగించొచ్చు
Published Wed, Dec 25 2013 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement