లెక్క సరిచేసిన ఇండియన్ ఏసెస్
లెక్క సరిచేసిన ఇండియన్ ఏసెస్
Published Wed, Dec 7 2016 2:19 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
యూఏఈ రాయల్స్‌పై గెలుపు ఐపీటీఎల్-2016
సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. మంగళవారం మొదలైన సింగపూర్ అంచె పోటీల్లో ఇండియన్ ఏసెస్ 26-19 పాయింట్ల తేడాతో యూఏఈ రాయల్స్ జట్టును ఓడించింది. మూడు రోజుల క్రితం జపాన్ అంచె పోటీల్లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ 20-30తో యూఏఈ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. తాజా విజయంతో ఏసెస్ జట్టు ఆ ఓటమికి బదులు తీర్చుకుంది.
నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం ఇండియన్ ఏసెస్ 10 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. మహిళల సింగిల్స్‌లో కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌స (ఏసెస్) 6-3తో అనా ఇవనోవిచ్‌ను ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-సానియా మీర్జా ద్వయం (ఏసెస్) 6-3తో క్యువాస్-మార్టినా హింగిస్ జంటపై గెలిచింది. పురుషుల లెజెండ్‌స సింగిల్స్‌లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఏసెస్) 6-3తో థామస్ జొహాన్సన్‌ను ఓడించగా... పురుషుల సింగిల్స్‌లో ఫెలిసియానో లోపెజ్ (ఏసెస్) 2-6తో బెర్డిచ్ చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో డోడిగ్-లోపెజ్ జంట (ఏసెస్) 6-4తో క్యువాస్-నెస్టర్ జోడీపై గెలిచింది.
ఫెడరర్, సెరెనా దూరం
హైదరాబాద్‌లో ఈనెల 9 నుంచి 11 వరకు జరగాల్సిన చివరి అంచె ఐపీటీఎల్ పోటీలకు స్టార్ క్రీడాకారులు రోజర్ ఫెడరర్, సెరెనా విలియమ్స్ దూరమయ్యారు. ఫెడరర్ పేరు ఏ జట్టులోనూ లేకున్నా... సెరెనా మాత్రం సింగపూర్ స్లామర్స్ తరఫున బరిలోకి దిగాల్సి ఉంది. ‘ఈ ఏడాది సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని అధిగమిస్తానన్న నమ్మకం ఉంది. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఫెడరర్, సెరెనాలకు వివరించాను. గత రెండు సీజన్‌లలో వీరిద్దరూ ఎంతో సహకరించారు. భవిష్యత్ సీజన్‌లలో వారు మళ్లీ బరిలోకి దిగుతారని ఆశిస్తున్నాను’ అని ఐపీటీఎల్ వ్యవస్థాపకుడు మహేశ్ భూపతి తెలిపాడు.
Advertisement
Advertisement