
‘రైజింగ్’కు సిద్ధం
స్టెయిన్ పర్యవేక్షణలో రాణిస్తాం వేదిక ఏదైనా పర్వాలేదు ఇషాంత్, ఇర్ఫాన్ ఆశాభావం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి విజయావకాశాలు ఉన్నాయని ఆ జట్టు పేసర్లు ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇషాంత్ గత నాలుగేళ్లుగా హైదరాబాద్ జట్టుతో కొనసాగుతుండగా, పఠాన్ తొలిసారి రైజర్స్‌తో జత కలిశాడు.
స్టెయిన్‌తో కలిసి జట్టును విజయాలబాటలో నడిపిస్తామని ఇషాంత్, ఇర్ఫాన్ అంటున్నారు. ఐపీఎల్-7 కోసం సన్‌రైజర్స్ శనివారం దుబాయ్ బయల్దేరి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో వీరు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విశేషాలు వారి మాటల్లోనే...
ఇషాంత్ శర్మ
ఐపీఎల్‌కు సన్నాహకాలు: అంతర్జాతీయ క్రికెటర్లకు ప్రత్యేక సన్నాహకాలు పెద్దగా అవసరం లేదు. ఈ సారి జట్టులో చాలా మంది కొత్త ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి వారితో సమన్వయం చేసుకోవడమే ముఖ్యం. కోచ్ మూడీ అదే పనిలో ఉన్నారు. అసలు మ్యాచ్‌లకు ముందు స్వల్ప కాలిక క్యాంప్ జరగడం కొంత ఉపయోగపడుతుంది. నా వరకు ఇటీవల ముస్తాక్ అలీ ఆడి టి20తో టచ్‌లోనే ఉన్నాను.
జట్టు అవకాశాలు: గత ఏడాది సన్‌రైజర్స్ టీమ్‌గా తొలిసారి బరిలోకి దిగినా టాప్-4లో నిలవగలిగాం. ఈసారి కచ్చితంగా మా ప్రదర్శన మెరుగవుతుందనే ఆశిస్తున్నా.
యూఏఈ వేదికలపై: షార్జా, దుబాయ్‌లలో నేను ఎప్పుడూ ఆడలేదు. అయితే కొంత మంది నా జూనియర్ సహచరులు చెప్పినదాని ప్రకారం చూస్తే అక్కడ కూడా భారత్‌ను పోలిన వికెట్లే ఉంటాయి. అయినా టి20ల్లో వికెట్‌వంటి అంశాలు పెద్దగా ప్రభావం చూపవు.
ఇర్ఫాన్ పఠాన్
జట్టు మారడంపై: ఐపీఎల్‌లో ఇది నా మూడో జట్టు. గత ఆరు ఎడిషన్లలో వ్యక్తిగతంగా కొన్ని చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదు చేశాను. అయితే విజేతగా నిలిచిన జట్టులో భాగం కాలేకపోయాను. ఈ సారి ఆ కోరిక తీరుతుందని నా విశ్వాసం.
సన్‌రైజర్స్ సభ్యులపై: మా జట్టు ఆల్‌రౌండర్లతో సమతూకంగా ఉంది. టి20కి సరిగ్గా సరిపోయే ఆటగాళ్లు ఉన్నారు. నా పరంగా చూస్తే బౌలింగ్‌తో పాటు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడున్న కూర్పును బట్టి నాలుగు, ఐదు స్థానాల్లో అవకాశం దక్కితే మంచిది.
తొలి సారి స్టెయిన్‌తో ఆడనుండటం: ఈ సీజన్‌లో నన్ను అన్నింటికంటే ఎక్కువగా ఉద్వేగానికి గురి చేస్తున్న విషయం అదే. అతని వెంట పడి మరీ కొత్తగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా. ప్రపంచ నంబర్‌వన్ బౌలర్‌గా ఉన్నా ప్రతీ బంతికి అతను కష్టపడే తీరు, అతనిలోని ఎనర్జీ నిజంగా గ్రేట్.