సానియా మీర్జా ‘స్వీట్ గర్ల్’...
* సచిన్ అంటే చాలా ఇష్టం
* టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ప్రశంసలు కురిపించాడు. ‘గత ఏడాది సానియాతో కలిసి ఐపీటీఎల్‌లో మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ ఆడాను. అంతకుముందు నుంచే ఆమె పరిచయం. అయితే ఆమెతో ఆడాక తనో స్వీట్ గర్ల్ అని అర్థమైంది. ఈ ఏడాది వింబుల్డన్ డబుల్స్ ఫైనల్ మొత్తం చూశాను.
ఆమె అద్భుతంగా ఆడింది. సానియా-హింగిస్ జోడీకి ప్రతి టోర్నీలోనూ మద్దతు ఇస్తాను’ అని ఫెడరర్ చెప్పాడు. అలాగే భారత క్రీడాకారులలో తనకు క్రికెటర్ సచిన్ అంటే చాలా ఇష్టమన్నాడు. ‘వింబుల్డన్‌లో సచిన్‌ను కలిసి మాట్లాడాను. అతనో గొప్ప క్రీడాకారుడు. నేను ఎప్పుడు వీడియోగేమ్ క్రికెట్ ఆడినా తనని నా జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా తీసుకుంటాను’ అని ఫెడరర్ అన్నాడు. ఐపీటీఎల్ ద్వారా భారత్‌కు వచ్చే అవకాశం మరోసారి లభించడం సంతోషంగా ఉందని ఈ స్టార్ ఆటగాడు చెప్పాడు.