గెట్..సెట్.. కిక్
నేటి నుంచి ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ టోర్నీ
తొలి మ్యాచ్‌లో చెన్నైయిన్, కోల్‌కతా అమీతుమీ
చెన్నై: గతేడాది విశేష ఆదరణ పొందిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. నేడు (శనివారం) చెన్నైలో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా, చెన్నైయిన్ ఎఫ్‌సీల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుంది. ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఆటగాళ్లతో పాటు చురుకైన దేశవాళీ కుర్రాళ్లు ఈ టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. టోర్నీ కోసం అన్ని ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నాయి. గతేడాది టోర్నీ మధ్యలో అనూహ్యంగా వెనుకబడిన కొన్ని జట్లు ఈసారి టైటిల్ కోసం అనుభవజ్ఞులైన ఆటగాళ్లను రంగంలోకి దించుతున్నాయి. ఈసారి కూడా ఎనిమిది ప్రధాన నగరాలు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఐఎస్‌ఎల్ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, సచిన్‌లతో పాటు ధోని, కోహ్లిలకు కూడా ఐఎస్‌ఎల్ జట్లలో భాగస్వామ్యం ఉండటంతో క్రికెట్ అభిమానులు కూడా దీనిపై దృష్టిపెడుతున్నారు. ఓవరాల్‌గా క్రికెట్ తర్వాత దేశంలో మరింత ఆదరణ పెంచుకునే దిశగా ఫుట్‌బాల్ అడుగులు వేస్తోంది.
ఘనమైన ఏర్పాట్లు
జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పులతో పాటు లేజర్ షో, బాలీవుడ్ సెలబ్రిటీల హంగామా ఈ వేడుకకు మరింత ఆకర్షణ తేనుంది. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్, ఆలియా భట్, అర్జున్ కపూర్‌లు తమ నృత్యాలతో అలరించేందుకు సిద్ధమవుతుండగా, మ్యూజిక్ డెరైక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతంతో ఓలలాడించనున్నాడు. కార్యక్రమానికి సంబంధించిన టిక్కెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి.
ఫ్రాంచైజీల సంతోషం
ఓవైపు భారత్‌లో క్రికెట్ సీజన్ మొదలవుతున్నా... ఫుట్‌బాల్‌కు ఆదరణ తగ్గకపోవడం ఫ్రాంచైజీలను సంతోషపరుస్తోంది. గతేడాది రూ. 55 కోట్లు మాత్రమే ఉన్న స్పాన్సర్‌షిప్ ఆదాయం ఈసారి గణనీయంగా రూ. 100 కోట్లకు చేరడమే దీనికి నిదర్శనం.
గతేడాది చాంపియన్: అట్లెటికో డి కోల్‌కతా
గతేడాది రన్నరప్: కేరళ బ్లాస్టర్స్
8: టోర్నీలో పాల్గొంటున్న జట్లు
49: టోర్నీ జరిగే రోజులు
61: మొత్తం మ్యాచ్‌ల సంఖ్య