రెండో సీజన్‌కు రంగం సిద్ధం
రేపటి నుంచి ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్
ఈ ఏడాది రూ.100 కోట్లకు చేరిన స్పాన్సర్‌షిప్ ఆదాయం
న్యూఢిల్లీ: భారత్‌లో ఆటంటే క్రికెటే అన్న అభిప్రాయాన్ని ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ తిరగరాసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. తొలి ఏడాది ఈ టోర్నీకి విశేష ఆదరణ లభించింది. ఎనిమిది నగరాల్లో జరిగిన మ్యాచ్‌లకు ఫుట్‌బాల్ ప్రేమికులు పోటెత్తారు. ఈనేపథ్యంలో శనివారం నుంచి జరిగే రెండో సీజన్‌పై అంచనాలు పెరిగాయి. టోర్నీ తొలి మ్యాచ్ అట్లెటికో డి కోల్‌కతా, చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరుగుతుంది. ఇక ఐఎస్‌ఎల్-1 సూపర్ సక్సెస్‌తో ఫ్రాంచైజీలన్నీ సంతోషంగా ఉన్నాయి.
ఇదే జోరు కొనసాగితే నాలుగో సీజన్ ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పడతామని గట్టిగా నమ్ముతున్నాయి. ఐఎస్‌ఎల్-2పై కార్పొరేట్ కంపెనీలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. అందుకే స్పాన్సర్‌షిప్ ఆదాయం కింద నిర్వాహకులకు ఈసారి రూ.100 కోట్ల ఆదాయం లభించింది. ఇది గతేడాది రూ.55 కోట్లుగా ఉంది. ఆయా జట్లు కూడా తమ స్పాన్సర్‌షిప్ ఆదాయాన్ని దాదాపు రెండింతలుగా ఆర్జించాయి. 2014లో జెర్సీ ముందు లోగోకు రూ.5-6 కోట్ల మధ్య తీసుకుంటే ఈసారి అది రూ.8-10 కోట్లకు చేరింది. కోల్‌కతా గతేడాది ఐదు ముఖ్య స్పాన్సర్లతో రంగంలోకి దిగగా ఈసారి ఆరింటితో బరిలోకి దిగుతోంది.
ప్రారంభ వేడుకల్లో ఐశ్వర్య, రెహమాన్ ‘షో’
ఐఎస్‌ఎల్ రెండో సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించనుంది. శనివారం సాయంత్రం జరిగే ప్రారంభ వేడుకల్లో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఐదేళ్ల విరామం అనంతరం ఆమె తన డ్యాన్స్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేయనుంది. అంతేకాకుండా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా తన సంగీతంతో ఉర్రూతలూగించనున్నాడు. ఇంకా ఇతర ప్రముఖులు కూడా తమ షోతో ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి.