యూఎస్లో టీ 20లపై కుంబ్లే..
లాడర్‌హిల్: యూఎస్లోని టీ 20 మ్యాచ్ల్లో భాగంగా భారత-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య జరిగే పోరుకు ఆతిథ్యమివ్వనున్న ఫ్లోరిడా రాష్ట్రంలోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్ స్టేడియం తనను ఎంతో ఆకట్టుకుందని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆమోదం పొందిన ఇక్కడ స్టేడియంలోని వసతులను చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు కుంబ్లే తెలిపాడు. అమెరికాలో క్రికెట్ ఆట స్థాయిని పెంచడానికి చేసే ఈ ప్రయత్నం నిజంగానే సరికొత్త ఆరంభంగా అభివర్ణించాడు. ఈ రెండు మ్యాచ్ల టీ 20 సిరీస్తో అమెరికాలో క్రికెట్పై ఆదరణ పెరుగుతుందని కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు.
' ఈ తరహాలో స్టేడియం వసతులు ఏర్పాటు చేస్తారని నేను అసలు ఊహించలేదు. యూఎస్లో ఇంత ఘనంగా మ్యాచ్లు జరపడానికి నడుంబిగించడం కచ్చితంగా అక్కడ వచ్చిన మార్పుకు నాంది. ఫ్లోరిడాలోని గ్రౌండ్ బాగుంటుందని గతంలోనే విన్నా. అయితే ఈరోజు కళ్లతో చూసి ఆశ్చర్యానికి లోనయ్యా. నేను ఊహించిన దానికంటే ఇక్కడ వసతులు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ గ్రౌండ్ను, ఇక్కడి వికెట్ను చూడటం ఇదే మొదటిసారి. అవుట్ ఫీల్డ్ కూడా బాగుంది. యూఎస్లో భారత్ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం ఇదే తొలిసారి. ఇక్కడ క్రికెట్ పై ఆదరణ పెంచాలనే ఐసీసీ చేసే ప్రయత్నం త్వరలోనే నెరవేరుతుంది' అని కుంబ్లే తెలిపాడు. శని, ఆదివారాల్లో విండీస్‌తో టి20 మ్యాచ్‌లు జరుగనున్న సంగతి తెలిసిందే.