ఇవనోవిచ్ అలవోకగా...
న్యూయార్క్: ప్రపంచ మాజీ నంబర్‌వన్ అనా ఇవనోవిచ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 13వ సీడ్ ఇవనోవిచ్ 6-2, 6-0తో అనా తాతిష్‌విలి (జార్జియా)పై గెలిచింది. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా, ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన ఇవనోవిచ్ కెరీర్ ఆ తర్వాత తడబడింది. బరిలోకి దిగిన గత 21 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఈ సెర్బియా బ్యూటీ కేవలం ఒక టోర్నీలో (గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో) మాత్రమే క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది.
ఈసారి గత ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇవనోవిచ్‌కు తొలి రౌండ్‌లో అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఈ మాజీ నంబర్‌వన్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 3-6, 6-1తో మిసాకి డోయ్ (జపాన్)పై కష్టపడి గెలుపొందగా... 10వ సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-4, 6-2తో తిమియా బాబోస్ (హంగేరి)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 10వ సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) 6-3, 7-6 (8/6), 6-3తో ఫాబియానో (ఇటలీ)పై విజయం సాధించాడు.
నాదల్ శుభారంభం
గాయం నుంచి కోలుకున్నాక అద్భుత ఫామ్‌లో ఉన్న 2010 యూఎస్ ఓపెన్ చాంపియన్ రాఫెల్ నాదల్‌కు తొలి రౌండ్‌లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ‘అమెరికా రైజింగ్ స్టార్’ ర్యాన్ హారిసన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాదల్ 6-4, 6-2, 6-2తో గెలిచి హార్డ్ కోర్టు సీజన్‌లో వరుసగా 16వ విజయాన్ని నమోదు చేశాడు. మరోవైపు 27వ సీడ్ ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్), 30వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.
ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా) 6-3, 7-5, 1-6, 4-6, 6-3తో వెర్దాస్కోపై; ఆండ్రియా హైదర్ మారెర్ (ఆస్ట్రియా) 3-6, 6-3, 1-6, 7-6 (7/4), 6-4తో గుల్బిస్‌పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 7-5, 6-3, 6-2తో కిర్గియోస్ (ఆస్ట్రేలియా)పై; ఎనిమిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-2తో రసెల్ (అమెరికా)పై; 19వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్) 6-3, 6-7 (6/8), 6-3, 6-2తో మాటోసెవిచ్ (ఆస్ట్రేలియా)పై; 23వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 6-7 (4/7),6-2, 6-3, 6-3తో సెరా (ఫ్రాన్స్)పై నెగ్గారు.
సెరెనా ముందంజ
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ తన టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించింది. తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సెరెనా 6-0, 6-1తో 2010 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఫ్రాన్సెస్కా షియవోని (ఇటలీ)ని చిత్తు చేసింది.
క్యాన్సర్‌ను జయించి...
రెండేళ్ల క్రితం ప్రపంచ 20వ ర్యాంకర్‌గా నిలిచి ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన రష్యా టెన్నిస్ ప్లేయర్ అలీసా క్లెబనోవా పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. 24 ఏళ్ల క్లెబనోవా తొలి రౌండ్‌లో 6-4, 3-6, 7-5తో మోనికా పుయెగ్ (ప్యూర్టోరికో)పై గెలిచింది. గతంలో యూఎస్ ఓపెన్‌లో ఆడిన రెండుసార్లూ ఈ రష్యా ప్లేయర్ రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. ‘క్యాన్సర్ నుంచి బయటపడి మళ్లీ రాకెట్ పట్టినందుకు ఆనందంగా ఉంది.
మళ్లీ విజయాలబాట పడతాననే విశ్వాసం ఉంది. 2011 మేలో క్యాన్సర్ బారిన పడ్డాను. ఆ తర్వాత ఆరు నెలలపాటు కిమోథెరపీ చేయించుకున్నాను. చాలా రోజుల క్రితమే చికిత్స పూర్తయినా కోలుకోవడానికి సమయం పట్టింది. మొత్తానికి మరోసారి మెగా ఈవెంట్‌లో ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని క్లెబనోవా వ్యాఖ్యానించింది. ఈమె 2003లో సానియా మీర్జాతో కలిసి వింబుల్డన్ జూనియర్ బాలికల డబుల్స్ టైటిల్ నెగ్గింది.