లెక్క సరిచేసిన శ్రీకాంత్
జపాన్ ఓపెన్‌లో కశ్యప్‌పై విజయం
జయరామ్, ప్రణయ్ ముందంజ
టోక్యో: రియో ఒలింపిక్స్ తర్వాత జరుగుతున్న తొలి సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, అజయ్ జయరామ్ శుభారంభం చేయగా... క్వాలిఫయర్ పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ తొలి రౌండ్‌లో ఇంటిముఖం పట్టారు.
గత ఏడాది ఇదే టోర్నమెంట్‌లోని రెండో రౌండ్‌లో కశ్యప్ చేతిలో ఎదురైన ఓటమికి కిడాంబి శ్రీకాంత్ బదులు తీర్చుకున్నాడు. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 14-21, 21-14, 23-21తో ప్రపంచ 74వ ర్యాంకర్ కశ్యప్‌ను ఓడించాడు.
గతంలో కశ్యప్‌తో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన శ్రీకాంత్ మూడో ప్రయత్నంలో మాత్రం సఫలమయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్ 21-19, 23-21తో సోనీ ద్వి కుంకోరో (ఇండోనేసియా)పై, ప్రణయ్ 23-21, 19-21, 21-18తో ఇస్కందర్ జుల్కర్‌నైన్ జైనుద్దీన్ (మలేసియా)పై గెలుపొందగా... సాయిప్రణీత్ 21-9, 21-23, 10-21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అజయ్ జయరామ్‌తో శ్రీకాంత్; రెండో సీడ్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు.