
కేప్‌టౌన్: అరంగేట్ర మ్యాచ్‌ల్లో దిగ్గజ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టిన బౌలర్లలో టీమిండియా పేసర్ జస్ర్పిత్ బూమ్రా ఒకడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అరంగేట్రం మ్యాచ్‌లో కోహ్లిని అవుట్ చేసిన ఈ ముంబై ఆటగాడు.. అరంగేట్ర వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. టీ20లో ప్రమాదకర ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేశాడు.
షార్ట్ ఫార్మాట్‌లో తనదైన శైలితో స్పెషలిస్ట్ బౌలర్‌గా ముద్ర వేసుకున్న బుమ్రా లాంగెస్ట్ ఫార్మట్‌లో అరంగేట్రం చేయడానికి చాలా రోజులు నిరీక్షించాడు. తాజాగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనతో ఆ అవకాశం కూడా ఈ ముంబై ఆటగాడికి వచ్చింది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ద్వారా బుమ్రా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో సైతం తన మార్కును చూపించిన బుమ్రా.. దిగ్గజ ఆటగాడు సఫారీ మాజీ కెప్టెన్ డివిలియర్స్‌ను అవుట్ చేసి తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంచితే, తొలి టెస్టులో బూమ్రా మొత్తంగా నాలుగు వికెట్లు సాధించి సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌కు మాత్రమే పరిమితమైన బూమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు తీశాడు. అందులో డివిలియర్స్, డుప్లెసిస్, డీకాక్‌లు ఉన్నారు. అయితే డు ప్లెసిస్‌ను బూమ్రా బోల్తా కొట్టించిన తీరు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
దక్షిణాఫ్రికా రెండో ఇన‍్నింగ్స్‌లో భాగంగా 29 ఓవర్‌ను అందుకున్న బూమ్రా.. నాల్గో బంతికి డు ప్లెసిస్‌ను అవుట్ చేసిన తీరు ఔరా అనిపించింది. బంతిని డిఫెన్స్ ఆడదామని డు ప్లెసిస్ అనుకునేలోపే బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లిపోయింది. దాంతో ఒకింత ఆశ్చర్యానికి లోనైన డు ప్లెసిస్ పరుగులేమీ చేయకుండానే భారంగా నిష్క్రమించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment