కివీస్.. డబుల్ ట్రబుల్
కోల్ కతా:మూడు టెస్టు ల సిరీస్ లో ఇప్పటికే ఒక టెస్టు మ్యాచ్ ఓడిపోయి వెనుకబడిన న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు మరో రకమైన ఇబ్బందితో సతమవుతోంది. తొలి టెస్టులో ఘోర ఓటమి ఆ జట్టును తీవ్ర ఆందోళనలోకి నెడితే, ఇప్పుడు పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడటం కివీస్ ను మరింతగా కలవరపరుస్తుంది. గాయం కారణంగా తొలి టెస్టుకు అందుబాటులోకి లేకుండా పోయిన ఆల్ రౌండర్ జిమ్మీ నీషన్ రెండో టెస్టు నుంచి కూడా వైదొలిగాడు.
అతని గాయం ఇంకా పూర్తిగా నయం కాలేకపోవడంతో శుక్రవారం నుంచి కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో జరుగనున్న రెండో టెస్టుకు సౌతం నీషమ్ దూరం కానున్నట్లు న్యూజిలాండ్ కోచ్ హెస్సన్ తెలిపాడు. అయితే మరో బ్యాటింగ్ ఆల్ రౌండర్ ను జట్టులోకి తీసుకోవాలన్నా అది కూడా అందుబాటులో లేదట. ఇప్పటికే పలువురు ఆల్ రౌండర్లు గాయాల బారిన పడి స్వదేశంలో విశ్రాంతి తీసుకోవడంతో తమకు ప్రస్తుతం ఎటువంటి ప్రత్యామ్నాయం లేదని హెస్సన్ తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత్ తో అమీ తుమీ తేల్చుకోవాల్సిన రెండో టెస్టు తమకు సవాల్ వంటిదని పేర్కొన్నాడు.
గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన నీషమ్ చాలా కాలం తరువాత జట్టులో చోటు సంపాదించిన అది కూడా ఉపయోగపడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, గాయపడ్డ మరో కివీస్ ఆటగాడు మార్క్ క్రెయిగ్ స్థానంలో జీతన్ పటేల్ ఆడనున్నట్లు హెస్సెన్ తెలిపాడు. గురువారం నాటికి అతను జట్టుతో కలవబోతున్న విషయం ఒక్కటే తమకు ఊరట కల్గిస్తుందన్నాడు. ప్రధాన బౌలర్ టిమ్ సౌతీ టెస్టు సిరీస్ కు ముందే వైదొలగడంతో పాటు పలువురు ఆటగాళ్లు దూరం కావడంతో ఆ జట్టులో ఆందోళన రెట్టింపయ్యింది. మరోవైపు భారత జట్టు సిరీస్ పై కన్నేసింది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ ను ముందుగానే ముగించాలని విరాట్ అండ్ గ్యాంగ్ యోచిస్తోంది.రేపు ఇరు జట్ల మధ్య ఉదయం గం.9.30 ని.లకు మ్యాచ్ ఆరంభం కానుంది.