
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13వ సీజన్ ఆరంభానికి ఇంకా నెలకు పైగా సమయం ఉండగానే రాజస్తాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు సీజన్ల నుంచి రాజస్తాన్ రాయల్స్ విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. రాబోవు ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. మోచేతి గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో పాటు శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న ఆర్చర్.. ఐపీఎల్‌కు సైతం అందుబాటులో ఉండటం లేదు. సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతున్న ఆర్చర్‌కు కనీసం రెండు నెలలు విశ్రాంతి అవసరం.
దాంతో ఇంగ్లండ్ ఆడబోయే పలు సిరీస్‌లతో పాటు ఐపీఎల్ నుంచి ఆర్చర్ తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడిన ఆర్చర్.. మిగతా మూడు మ్యాచ్‌లకు విశ్రాంతిలో ఉన్నాడు. తన కుడి మోచేతికి పుండ్లు పడటంతో ఆ సిరీస్‌లో మ్యాచ్ మాత్రమే ఆడాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతోనే జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా ఆర్చర్ లేడు. అదే సమయంలో మార్చి 19 నుంచి శ్రీలంకతో ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కూడా ఆర్చర్‌ను పక్కన పెట్టారు. 2018లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆర్చర్.. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ సీజన్‌లో 15 వికెట్లతో రాణించిన ఆర్చర్.. 2019 సీజన్‌లో 11 వికెట్లతో మెరిశాడు. ఈ సీజన్ ఐపీఎల్ మార్చి 29వ తేదీ నుంచి ఆరంభం కానుంది.