
పుణేరి పల్టన్ బోణీ
బెంగాల్ వారియర్స్‌పై గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్-2
జైపూర్: బరిలో ఉన్న ఎనిమిది జట్లలో బోణీ కొట్టని జట్టుగా పేరున్న పుణేరి పల్టన్ ఎట్టకేలకు తొలి విజయాన్ని సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా బెంగాల్ వారియర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 33-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దాంతో వరుసగా నాలుగు పరాజయాలకు బ్రేక్ వేస్తూ తమ ఖాతాలో తొలి విజయాన్ని జమచేసుకుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో పుణే జట్టుకు ప్రవీణ్ నివాలి తురుపుముక్కగా నిలిచాడు. ఆరంభంలో రెండు జట్లు హోరాహోరీగా తలపడినా... విరామ సమయానికి రెండు నిమిషాలముందు పుణే ఒక్కసారిగా విజృంభించింది. ప్రవీణ్ నివాలి రైడింగ్‌కు వెళ్లి ఒకేసారి మూడు పాయింట్లు సంపాదించడంతో పుణే 13-10తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వజీర్ సింగ్ తన రైడింగ్‌లో రెండు పాయింట్లు సంపాదించడంతో పాటు బెంగాల్ ఆలౌట్ కావడంతో పుణే ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి. విరామ సమయానికి పుణే 17-10తో ముందంజలో ఉంది.
రెండో అర్ధభాగంలో పుణే ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఢిల్లీ దబాంగ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ జట్టు 27-35తో ఓడిపోయింది. ఈ సీజన్‌లో జైపూర్‌కిది ఐదో పరాజయం కావడం గమనార్హం.
గురువారం జరిగే ఏకైక మ్యాచ్‌లో పట్నా
పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది.