
నన్ను కాదని జట్టులో బెంగాలీనా: జ్వాల
సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడలకు ఎంపిక చేసిన తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టులో తనకు చోటు కల్పించకపోవడంపై డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను కాదని ఒక పశ్చిమ బెంగాల్ క్రీడాకారిణిని ఎంపిక చేశారని ఆమె ట్విట్టర్ ద్వారా విమర్శించింది. ‘తెలంగాణ జట్టులో బెంగాలీ ప్లేయర్‌కు స్థానం లభించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన నన్ను ఎందుకు ఎంపిక చేయలేదో ఆశ్చర్యంగా ఉంది.
తరుణ్, సిక్కిరెడ్డిలకు కూడా చోటు దక్కలేదంటే అసలు ఎవరు ఆడుతున్నారో అర్థం కావడం లేదు. ఎవరూ దీనిని ప్రశ్నించడం లేదు. ఒక బెంగాల్ అమ్మాయి తెలంగాణకు ఆడుతుందా? మేమంతా బతికే ఉన్నాం కదా’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే రాష్ట్ర జట్టును అసలు ఇప్పటి వరకు ప్రకటించనే లేదని తెలంగాణ సంఘం కార్యదర్శి పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశారు. మరో వైపు కేరళ జాతీయ క్రీడలకు తెలంగాణ రాష్ట్రం ఆటగాళ్లు 8 క్రీడాంశాల్లో, ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు 11 క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించడం దాదాపు ఖరారైంది.