
కోల్‌కతా: భారత క్రికెట్‌లో ఆ ఇద్దరి స్థానం ప్రత్యేకం... నాయకులుగా ప్రపంచ కప్‌లను అందించిన ఘనత వారి సొంతం... అయితే వేర్వేరు తరానికి చెందిన వీరిద్దరు కలిసి ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు. కానీ గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆ దృశ్యం ఆవిష్కృతమైంది. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక వ్యాపార ప్రకటన కోసం జత కట్టారు. 58 ఏళ్ల కపిల్ తనదైన శైలిలో బౌలింగ్ చేయగా... 36 ఏళ్ల ధోని తన బ్యాటింగ్ ప్రత్యేకతను ప్రదర్శించాడు. ఆ తర్వాత ధోని కూడా కపిల్‌కు బౌలింగ్ చేయడం విశేషం. ‘షూటింగ్ సమయంలో తాను బౌలింగ్ చేయలేనని, అలసిపోతానని ముందుగా చెప్పినా ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత కపిల్ ఆగలేదు.
పెద్ద సంఖ్యలో బంతులు విసరడంతో పాటు బ్యాటింగ్‌లో కూడా షాట్లు కొట్టారు. ఇక ధోని అయితే సహజ నటుడు. ఒక్కసారి కూడా నేను రీటేక్ చేయాల్సిన అవసరమే రాలేదు’ అని ఈ యాడ్ రూపకర్త అరిందమ్ సిల్ వెల్లడించారు. ఈ షూట్‌కు ముందు ధోని... భారత్, శ్రీలంక మధ్య జరిగే తొలి టెస్టు కోసం మైదానంలో జరుగుతున్న సన్నాహకాలను పరిశీలించాడు. మరో మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా వీరిద్దరితో జత కూడటంతో ఈడెన్ అంతా సందడిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment