సాక్షి, హైదరాబాద్: మాజీ సారథి ధోని టి20ల్లో కొనసాగేదీ లేనిది సెలక్టర్లు నిర్ణయిస్తారని భారత క్రికెట్ ఆల్‌రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ శనివారం ‘కృష్ణపట్నం పోర్ట్ గోల్డెన్ ఈగల్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్’ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ధోని మంచి ఫామ్‌లో ఉన్నాడని చెప్పారు. ‘ఎవరు కూడా జీవితాంతం క్రికెట్ ఆడలేరు.
కానీ... ఇప్పుడైతే ధోని బాగా ఆడుతున్నాడు. మిగతా సంగతి సెలక్టర్లు చూసుకుంటారు. క్రికెటర్ల విషయాల్లో మన వ్యాఖ్యానాల కంటే (బయటి వ్యక్తులు) సెలక్టర్లే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నాకు తెలియని అంశాలపై నాకు తోచిన అభిప్రాయం చెప్పి... దాన్ని గందరగోళం చేయదల్చుకోలేదు. ధోని టి20 భవిష్యత్తు నిర్ణయాన్ని పూర్తిగా సెలక్టర్లకే వదిలేద్దాం. అంతా ఆలోచించిన తర్వాత అతను ఆడేది... లేనిది వాళ్లే చెబుతారు’ అని కపిల్ అన్నారు.
ఇటీవల హైదరాబాద్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌లు ధోని పొట్టి ఫార్మాట్ కెరీర్‌పై వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల సామర్థ్యాన్ని తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించే అంశంపై స్పందిస్తూ... ‘మా తరంలో ఈ డీఎన్‌ఏ టెస్టులేవీ లేవు. కాబట్టి నాకు వాటి గురించి ఏమీ తెలియదు. దీనిపై మీరు నన్ను అడగడం కంటే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిని అడగడమే మంచిది. ఈ రోజుల్లోని ఆధునిక విజ్ఞానం (సైన్స్)పై నాకేం అవగాహన లేదు. తెలియని దానిపై నేను సమాధానం చెప్పలేను’ అని 58 ఏళ్ల విఖ్యాత క్రికెటర్ చెప్పారు. ఆటలో ప్రత్యర్థి జట్టును గౌరవించాలని, బాగా ఆడితే తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment