ట్రోఫీలతో వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ మైండ్స్, గ్లోబ్ టోటర్స్ చాంపియన్‌షిప్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కార్తీక్ నీల్ వడ్డేపల్లి సత్తా చాటాడు. ఆనంద్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. సోమవారం జరిగిన అండర్–12 బాలుర సింగిల్స్ ఫైనల్లో కార్తీక్ నీల్ (తెలంగాణ) 6–4, 6–3తో అన్షుల్ విక్రమ్ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. మరోవైపు అండర్–14 బాలుర డబుల్స్ ఫైనల్లో అన్షుల్ విక్రమ్‌తో జతకట్టిన కార్తీక్‌నీల్ 5–4 (4), 4–2తో ప్రణవ్ (కర్ణాటక)–ఉద్భవ్ (తెలంగాణ) జంటపై విజయం సాధించారు. బాలికల డబుల్స్‌లో అభయ వేమూరి జంట చాంపియన్‌గా నిలిచింది.
టైటిల్‌పోరులో అభయ– అపూర్వ వేమూరి (తెలంగాణ) ద్వయం 4–2, 4–1తో ఆర్నిరెడ్డి– ఐరాసూద్ (తెలంగాణ) జోడీపై గెలుపొందింది. అండర్–12 బాలికల ఫైనల్లో అపూర్వ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ విభాగంలో కర్ణాటకకు చెందిన టిష్యా ఖండేవాల్ 6–0, 6–0తో అపూర్వపై నెగ్గింది. అండర్–14 బాలికల సింగిల్స్‌లోనూ టిష్యా ఖండేవాల్ 6–1, 6–2తో నీల కుంకుమ్ (తెలంగాణ)ను ఓడించి టైటిల్‌ను చేజిక్కించుకుంది.