కరుణ్‌ నాయర్‌కు  మళ్లీ అవకాశం  | Karun Nair replaces Virat Kohli for Afghanistan Test | Sakshi
Sakshi News home page

కరుణ్‌ నాయర్‌కు  మళ్లీ అవకాశం 

Published Wed, May 9 2018 1:17 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Karun Nair replaces Virat Kohli for Afghanistan Test - Sakshi

బెంగళూరు: ఊహించినట్లుగానే అఫ్గానిస్తాన్‌తో భారత్‌ ఆడాల్సిన ఏకైక టెస్టుకు బీసీసీఐ దృష్టిలో తగిన ప్రాధాన్యత లభించలేదు. పూర్తిగా ద్వితీయ శ్రేణి జట్టు కాకపోయినా... నలుగురు ప్రధాన ఆటగాళ్లను పక్కన పెట్టి ఈ మ్యాచ్‌ కోసం సెలక్టర్లు జట్టును ప్రకటించారు. కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు ఆసక్తి చూపించిన విరాట్‌ కోహ్లి ఈ టెస్టుకు దూరం కావడం ముందే ఖరారైంది. అతనితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు బోర్డు విశ్రాంతినిచ్చింది. బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో ‘ఎ’ ప్లస్‌ కేటగిరీలో ఉన్న ఈ నలుగురికి కీలకమైన ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు విరామం కల్పించగా... ఇదే జాబితాలో ఉన్న శిఖర్‌ ధావన్‌ మాత్రం టెస్టు ఆడబోతున్నాడు. కోహ్లి గైర్హాజరులో అజింక్య రహానే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. ఏడాది క్రితం కోహ్లి గాయపడినప్పుడు ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో కూడా రహానే సారథిగా వ్యవహరించాడు. ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న చతేశ్వర్‌ పుజారా, ఇషాంత్‌ శర్మ ఈ టెస్టు కోసం తిరిగి రానున్నారు. దక్షిణాఫ్రికాలో గాయంతో రెండు టెస్టులకు దూరమైన వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పునరాగమనం చేయగా... అతని స్థానంలో ఆడిన పార్థివ్, ప్రత్యామ్నాయంగా దక్షిణాఫ్రికాకు వెళ్లిన దినేశ్‌ కార్తీక్‌లలో ఎవరికీ చోటు దక్కలేదు.  

కుల్దీప్, శార్దుల్‌ కూడా... 
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పాల్గొన్న భారత టెస్టు జట్టుతో పోలిస్తే ముగ్గురికి కొత్తగా అవకాశం లభించింది. భారత్‌ తరఫున ‘ట్రిపుల్‌ సెంచరీ’ సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌కు మళ్లీ స్థానం లభించింది. అతను ఇప్పటి వరకు భారత్‌ తరఫున 6 టెస్టులు ఆడాడు. చెన్నైలో ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక (303 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ తర్వాత కరుణ్‌ వరుసగా 26, 0, 23, 5 స్కోర్లు చేశాడు. అయితే రంజీ ట్రోఫీలో మెరుగ్గా రాణించడంతో అతనికి మరో అవకాశం దక్కింది. అయితే కేఎల్‌ రాహుల్‌ నుంచి నాలుగో స్థానానికి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో నాయర్‌కు తుది జట్టులో చోటు కష్టమే. మరోవైపు పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్, చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌లను కూడా ఈ టెస్టుకు ఎంపిక చేశారు. కుల్దీప్‌ 2 టెస్టులు ఆడగా... శార్దుల్‌ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. జూన్‌ 14 నుంచి 18 వరకు బెంగళూరు వేదికగా భారత్, అఫ్గానిస్తాన్‌ టెస్టు జరుగుతుంది.  

అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు: అజింక్య రహానే (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, మురళీ విజయ్, లోకేశ్‌ రాహుల్, పుజారా, కరుణ్‌ నాయర్, వృద్ధిమాన్‌ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్, ఉమేశ్‌ యాదవ్, షమీ, హార్దిక్‌ పాండ్యా, ఇషాంత్‌ శర్మ, శార్దుల్‌ ఠాకూర్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement