50 ఓవర్లకు పైగా క్రీజ్లో..
కొలంబో:శనివారం లంచ్ లోపే తొలి ఇన్నింగ్స్ ఖతం.. ఒక సెషన్ లో ఎనిమిది వికెట్లు.. మ్యాచ్ మూడో రోజు ముగియడమే తరువాయి అని అంతా భావించాం. కానీ ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక అద్భుత పోరాటం చేసింది. చివరకు ఫలితం ఎలా ఉన్నా అసాధారణ ఆట తీరును ప్రదర్శించింది. ప్రధానంగా మూడో రోజు ఆటలో లంక ఫస్ట్ డౌన్ ఆటగాడు కుశాల్ మెండిస్ సెంచరీతో రాణిస్తే, నాల్గో రోజు ఆటలో ఓపెనర్ కరుణరత్నే శతకం సాధించాడు. ఇక్కడ వీరిద్దరూ భిన్నమైన శైలిలో భారత బౌలింగ్ కు పరీక్షగా పెట్టారు. మెండిస్ తన దూకుడైన ఆటతో సెంచరీ సాధిస్తే, కరుణరత్నే మాత్రం నిన్న లంచ్ తరువాత క్రీజ్ లోకి వచ్చి, ఈ రోజు లంచ్ తరువాత పెవిలియన్ కు చేరడం అతని పట్టుదలకు అద్దం పడుతోంది. దాదాపు 50 ఓవర్లకు పైగా క్రీజ్ లో ఉండి భారత బౌలర్లకు విషమ పరీక్ష పెట్టాడు. 307 బంతుల్ని ఎదుర్కొని 16 ఫోర్ల సాయంతో 141 పరుగులు సాధించిన తరువాత ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. దాంతోభారత్ కు మ్యాచ్ పై పట్టుచిక్కింది.
209/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంకేయులు స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు. జట్టు స్కోరు 238 పరుగుల వద్ద మలిందా పుష్పకుమార(16) వికెట్ ను కోల్పోయిన శ్రీలంక..ఆపై మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్ దినేశ్ చండిమాల్(2) వికెట్ ను సైతం చేజార్చుకుంది. పుష్పకుమారను అశ్విన్ బౌల్డ్ చేస్తే, జడేజా బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి చండిమాల్ అవుటయ్యాడు. దాంతో నాల్గవ రోజు లంచ్ సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇక లంచ్ తరువాత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన కరుణరత్నే అవుట్ కాగా, కాసేపటికి ఏంజెలో మాథ్యూస్ ఆరో వికెట్ గా అవుటయ్యాడు.