భారత బ్యాట్స్మెన్ జోరు
కొలంబో:శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో సైతం భారత బ్యాట్స్మెన్ జోరు కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో భాగంగా టీ విరామానికి భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసి మరింత భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 344/3 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విరాట్ సేన.. రెండో సెషన్ పూర్తయ్యేసరికి మరో నాలుగు వికెట్లు కోల్పోయి రెండొందలకు పైగా పరుగులు చేసింది.
ఈ రోజు ఆటలో చటేశ్వర్ పుజారా(133;232 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) నాల్గో వికెట్ గా నిష్క్రమించగా, ఆపై రహానే(132;222 బంతుల్లో14 ఫోర్లు) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో లంచ్ సమయానికి భారత్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 442 పరుగులు చేసింది. కాగా, అశ్విన్(54;92 బంతుల్లో5 ఫోర్లు, 1 సిక్స్),వృద్ధిమాన్ సాహా(59 బ్యాటింగ్)లు హాఫ్ సెంచరీలు సాధించి భారత జట్టు భారీ స్కోరుకు సహకరించారు. ప్రస్తుతం సాహాకు జతగా జడేజా(37 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో రాహుల్(57)అర్థ శతకం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తంగా భారత్ ఇన్నింగ్స్ లో ఇప్పటివరకూ రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు నమోదు కావడం విశేషం.