శ్రీలంక ఎదురీత
కొలంబో:భారత్ తో జరుగుతున్న రెండోటెస్టులో శ్రీలంక ఎదురీదుతోంది. 209/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంకేయులు స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు. జట్టు స్కోరు 238 పరుగుల వద్ద మలిందా పుష్పకుమార(16) వికెట్ ను కోల్పోయిన శ్రీలంక..ఆపై మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్ దినేశ్ చండిమాల్(2) వికెట్ ను సైతం చేజార్చుకుంది. పుష్పకుమారను అశ్విన్ బౌల్డ్ చేస్తే, జడేజా బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి చండిమాల్ అవుటయ్యాడు.
ఇదిలా ఉంచితే, ఓవర్ నైట్ ఆటగాడు దిముత్ కరుణరత్నే సెంచరీతో మెరిశాడు. అంతకుముందు కుశాల్ మెండిస్(110) సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే చాపచుట్టేసిన లంకేయులకు రెండో ఇన్నింగ్స్ లో ఈ ఇద్దరి సెంచరీలు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇంకా 180 పరుగులకు పైగా వెనకబడిఉన్న లంక జట్టు నాల్గో రోజు సుదీర్ఘ పోరాటం చేస్తే కానీ ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్,అశ్విన్,జడేజా, హార్దిక్ పాండ్యాలకు తలోవికెట్ దక్కింది.