ఒకే ఒక్కడు కోహ్లి
కొలంబో: టెస్టు క్రికెట్ లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలను సాధిస్తున్న టీమిండియా రికార్డులను కూడా కొల్లగొడుతోంది. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్ ను 2-0తో సైతం సొంతం చేసుకుంది. తద్వారా భారత జట్టు వరుసగా ఎనిమిదో టెస్టు సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సిరీస్ విజయాలన్నీ విరాట్ కోహ్లి సారథ్యంలో సాధించినవే కావడం ఇక్కడ విశేషం. మరొకవైపు శ్రీలంకలో వరుసగా రెండో టెస్ట్ సిరీస్ ను సాధించిన తొలి భారత కెప్టెన్ గా కోహ్లి రికార్డులెక్కాడు. అంతకుముందు 2015లో కోహ్లి నేతృత్వంలో భారత జట్టు శ్రీలంకలో సిరీస్ ను గెలిచిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంచితే, లంకలో ఇన్నింగ్స్ తేడాతో గెలవడం కూడా భారత్ కు ఇదే తొలిసారి. ఇక్కడ ఇన్నింగ్స్ విజయాన్ని సాధించిన మొదటి భారత క్రికెట్ కెప్టెన్ గా కోహ్లి రికార్డులెక్కాడు. మరొకవైపు అత్యధిక టెస్టు సిరీస్ విజయాలు సాధించే క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాను కోహ్లిని వెనుక్కినెట్టాడు. అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కంటే కోహ్లి ఒక సిరీస్ వెనుకంజలో ఉన్నాడు.
ఇది భారత్ కు శ్రీలంకలో మూడో సిరీస్ విజయం. అంతకుముందు 1993, 2015ల్లో భారత జట్టు లంకలో సిరీస్ లు గెలిచింది. కొలంబోని ఎస్ఎస్సీ గ్రౌండ్ లో వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లు గెలిచిన తొలి పర్యాటక జట్టు భారత్.