
కౌశల్-గిరీశ్ జోడీకే టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఇన్‌లాండ్ జాతీయ హోబి 16 సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో ఆర్టిలరీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఏడబ్ల్యూఎస్‌ఏ) కు చెందిన కౌశల్ కుమార్ యాదవ్-గిరీశ్ జోడి విజేతగా నిలిచింది. హుస్సేన్ సాగర్ జలాల్లో బుధవారం ఈ పోటీలు ముగిశాయి. మొత్తం 12 రేస్‌ల అనంతరం ఈ జంట ఓవరాల్‌గా 21 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం అందుకుంది. ఏడబ్ల్యూఎస్‌ఏ కే చెందిన సెయిలింగ్ జంట కె.యాకోబు-రాజీవ్ కుమార్‌లకు రెండో స్థానం లభించింది. రజతం గెలుచుకున్న ఈ జోడికి మొత్తం 28 పాయింట్లు లభించాయి. ఐఎన్‌డబ్ల్యూఎస్‌కు చెందిన ఇమోలెమ్‌నాక్-శేఖర్ యాదవ్‌లు కాంస్యం గెలుచుకున్నారు. ఓవరాల్‌గా 37 పాయింట్లతో వీరు మూడో స్థానంలో నిలిచారు.
బుధవారం చివరి రోజు పోటీల్లో రెండు రేస్‌లు జరిగాయి. 11వ రేస్‌లో ఇమోలెమ్‌నాక్-శేఖర్ యాదవ్ గెలవగా, కమలేశ్ పటేల్-రావంకర్ కు రెండో స్థానం, బ్రిజ్‌రాజ్‌వర్మ-పంకజ్‌లకు మూడో స్థానం లభించింది. 12వ రేస్‌ను యాకోబు-రాజీవ్ గెలుచుకున్నారు. పవన్-సుఖేర్ రెండో స్థానంలో నిలవగా, కౌశల్-గిరీశ్‌లకు మూడో స్థానం దక్కింది. విజేతలకు ఆర్టిలరీ సెంటర్ కమాండెంట్ ఎన్‌ఎస్ జాదవ్, ఏడబ్ల్యూఎస్‌ఏ ఓఐసీ మేజర్ విమల్ కాంతవాల్ బహుమతులు అందజేశారు.